కాలం, స్థలం, దూరం మనం జయించలేం. దూరం కొంత మన మాట వింటుంది. అమెరికాలో ఉన్న వాళ్లని చూస్తూ మాట్లాడొచ్చు. కానీ ఇండియా నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత డబ్బున్నా కొన్ని గంటలు ప్రయాణించాల్సిందే. విమానం మారుతుంది. సౌకర్యాలు మారుతాయి, వేగం కూడా మారుతుంది. కానీ దూరం మారదు.
రెండు వేర్వేరు కాలాల్లో ఎప్పటికీ జీవించలేం. స్థలమైనా అంతే. ఎక్కడో ఒక చోటే ఉండగలం. టైమ్, స్పేస్ ఈ ప్రపంచానికి మూల బిందువులు. కానీ కల అన్నింటిని మరిపిస్తుంది. కలలో మనం బాల్యంలో వుంటాం. జలపాతం ముందు నిలుచుని వుంటాం. లేదా కొండచిలువకి ఆహారంగా మారుతూ వుంటాం. కలలుంటే పీడకలలు కూడా వుంటాయి.
సినిమా ఒక కల. మంచి సినిమా వున్నప్పుడు, మంచింగ్ సినిమాలు కూడా వుంటాయి, అవి నంజుకు తింటాయి. ఏ సినిమా అయినా మనల్ని చూసుకుంటాం. మంచి సినిమా టైమ్ మిషన్ లాంటిది. కాసేపు ఎక్కడికో తీసుకెళ్లి, మళ్లీ ఈ ప్రపంచంలోకి మోసుకొస్తుంది.
పుస్తకం కూడా కలల ద్వారమే. అయితే ఆర్ట్, ఎడిటింగ్, ధ్వని అన్నీ మనమే. ఒక రాజు గురించి చదువుతుంటే, అయన్ని మనమే మనసులో చిత్రలేఖించాలి. వాళ్ల మాటల్ని కూడా మనమే మాట్లాడాలి. అక్షరాలు దృశ్యాలవుతాయి.
సినిమాకి కష్టం అక్కర్లేదు. అన్నీ వాళ్లే చేసి కళ్ల ముందు ప్రదర్శిస్తారు. గంభీరమైన మహారాజు, అందమైన యువరాణిని ఊహించక్కర్లేదు. వచ్చి తెరమీద నిలబడుతారు. ప్రేమిస్తారు, యుద్ధం చేస్తారు. శతాబ్దాల వెనక్కి లేదా ముందుకి తీసుకెళ్తారు.
సినిమా వుంది కాబట్టే దేవుళ్లైనా, రాక్షసులైనా కళ్ల ముందు వచ్చి నిలబడతారు. లేకపోతే కృష్ణున్ని, రామున్ని, దుర్యోధనున్ని ఎప్పుడైనా మనం చూశామా? చూస్తామా?
కాలాన్ని కాళ్లుచేతులు కట్టి కట్టిపడేసేది సినిమా. స్థలాన్ని మాయ చేసి, మనల్ని పారాచుట్‌లో తీసుకెళ్లి అగ్ని పర్వతాలు, అగాధాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు, ఎస్కిమోలని చూపించేది సినిమా. టెక్నాలజీకి సవరణలు, పొడగింపులు కనుక్కున్నారే కానీ, సినిమాకి మించింది ఇంకా కనిపెట్టలేదు.
సినిమా కొందరి కలలకి బంగారాన్ని తాపడం చేస్తుంది. కొందరికి కలలే లేకుండా చేస్తుంది. వెతికే వాళ్లందరికీ బంగారం దొరకదు. వెతక్కపోతే ఎప్పటికీ దొరకదు. మిరిమిట్లు గొలిపే లైట్లు మోసేవాళ్లు చీకటిలో జీవించడం కూడా సినిమానే. అందమైన కలలు కూడా మెలకువతోనే ముగుస్తాయి.
జీఆర్ మహర్షి