ఒకవైపు జనసేనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేవలం 21 సీట్లలో పోటీకి పరిమితం చేయడం వల్ల కాపు ఓట్లు తెలుగుదేశం పార్టీకి బదిలీ అయ్యే సమస్యే లేదని స్పష్టం అవుతోంది. జనసేనకు కనీసం 60 సీట్ల వరకూ కేటాయిస్తే కాపుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ప్రభావవంతంగా బదిలీ అవుతాయనేది ఆ సామాజికవర్గం ప్రముఖుల విశ్లేషణే! అయితే 60 సీట్ల ఊసే లేదు! రేంజ్ 20కి పడిపోయింది!
24 సీట్లు, గాయత్రి మంత్రం అంటూ పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడారు. అయితే అదీ పోయి 21కి పడిపోయింది కథ! మరి ఈ 21 సీట్లలో అయినా జనసేనలో పుట్టి పెరిగిన నేతలు పోటీ చేస్తారా.. అంటే అంత సీన్ లేదని స్పష్టం అవుతోంది.
రాజమండ్రిపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థిని నిడదవోలుకు పంపించారు! నిడదవోలులో తెలుగుదేశం పార్టీ క్యాడర్ సహకరిస్తుందనే నమ్మకం ఏమీ లేదు! ఈ విషయంలో టీడీపీ వాళ్లు గయ్యిమంటున్నారు! ఇక జనసేనకే అనుకున్న సీట్లలో అయినా.. జనసేన తయారు చేసిన నేతలు ఒక్కరంటే ఒక్కరైనా పోటీ చేస్తారా? అనేది శేష ప్రశ్న! పరిస్థితి చూస్తుంటే అలాంటిదేమీ జరిగేలా లేదు!
తిరుపతిలో జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి తాజాగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న గంటా నరహరికి ఖరారు చేశారట! తిరుపతి విషయంలో జనసేన తరఫున రకరకాల పేర్లు వినిపించి చివరకు తెలుగుదేశం నుంచి చేరి వచ్చిన ఒక పచ్చచొక్కాకు టికెట్ ఇస్తున్నారట! భీమవరం విషయంలో తెలుగుదేశం నుంచి చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పేరు వినిపిస్తోంది! కొణతాల రామకృష్ణ కూడా జనసేనలో ఎన్నాళ్ల నుంచి పోటీ చేస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు! తెలుగుదేశం నుంచి రాకపోయినా ఆయనా వలస జీవే!
అయితే ఈ జాబితా ఇంతటితో అయిపోలేదు.. జనసేన 21 సీట్లకూ అభ్యర్థులను తేల్చే సరికి.. అందులో మెజారిటీ మొహాలు పచ్చచొక్కాలను అలా విడిచి వచ్చినవే ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది. పోటీకి ఇచ్చిన 21 సీట్లలో కూడా అంతటా పచ్చచొక్కాలనే బరిలోకి దించడంలో కూడా చంద్రబాబు మార్కు రాజకీయం సాగుతున్నట్టుగా ఉంది!