Advertisement

Advertisement


Home > Politics - Opinion

చంద్రబాబుని ముంచడానికే బీజేపీ పొత్తు

చంద్రబాబుని ముంచడానికే బీజేపీ పొత్తు

మహాభారతంలో యుద్ధం ముందు ఒక పాపులర్ సన్నివేశం...అందరికీ తెలిసిందే...

అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సాయం కోసం వెళ్లారు. అర్జునుడు శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని కోరకుండా నువ్వు నా తోడుంటే చాలన్నాడు. దుర్యోధనుడు మాత్రం శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని అడిగాడు. తన సైన్యం ఎటు ఉంటుందో ఆ వర్గమే గెలిచేలా శ్రీకృష్ణుడు చూస్తాడని దుర్యోధనుడు అనుకుని ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. అర్జునుడి రథాన్ని నడిపి, నానా మాయలు చేసి దుర్యోధన వర్గాన్ని మట్టికరిపించేసాడు. 

ఇప్పుడు జగన్ రథసారథి మోదీయే అన్నట్టుగా ఉంది.  భాజపా సేన తెదేపాతో పొత్తులోకి చేరినా మోదీ యుక్తి,శక్తి,ఆసక్తి మాత్రం జగన్ వైపే ఉన్నాయనిపిస్తోంది. 

చంద్రబాబు, పవన్ లను మోదీ కలవలేదు. తన సేనాపతులైన అమిత్ షా, నడ్డాలనే కలిసేలా చేసాడు. అంటే అదృశ్యరూపంలో జగన్ ఎన్నికలరథానికి తను సారధ్యం వహించబోతున్న సంకేతమివ్వడంలేదూ!

అసలిది బీజేపీ కోరుకున్న పొత్తు కాదు. చంద్రబాబు కోరి కోరి వెంటాడి వేధించి ఏర్పరుచుకున్న పొత్తు. అంతమాత్రానికే బీజేపీ వాళ్లు ఒప్పేసుకున్నారా?

చంద్రబాబు తపస్సుకి మెచ్చి వరాలిచ్చేసారా? ఆ వరాలివ్వడం వెనుక తమ లెక్కలు కూడా తాము చూసుకుంటారుగా?

ఈ పొత్తులో భాగమైనా కూడా ఆంధ్రా బీజేపీ నాయకులెవ్వరూ జగన్ ని పన్నెత్తి మాట అనడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆగడాలకి అంతం పలకడానికే తమ పార్టీ తెదేపా-జనసేనతో కలిసిందని అనట్లేదు. 

అంటే కేంద్రం నుంచి వాళ్లకి స్ట్రిక్ట్ సంకేతాలేవో వచ్చాయనుకోవాలా? అంతే కాదు..కేంద్ర నాయకులు కూడా జగన్ వ్యతిరేక నినాదాలేవీ చేయట్లేదు.

ఇలాంటి వాతావరణంలో అసలీ పొత్తుని ఎలా అర్ధం చేసుకోవాలి? 

తెదేపాని పూర్తిగా ముంచేసి వైకాపాకి లబ్ధి చేకూర్చే పనులేవో చేయడానికే బెజేపీ ఆలోచిస్తోందని అనిపించట్లేదు?  

పోయిన సార్వత్రిక ఎన్నికల లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశులో 0.7% ఓటు బ్యాంకున్న పార్టీ బీజేపీ. 6% ఓటు బ్యాంక్ జనసేనది. ఈ రెండూ కలిపినా మైనారిటీ ఓట్ బ్యాంకైన 9-10% ని అందుకోవట్లేదు. ఇప్పుడు బీజేపీ పొత్తులో కలవడంతో ఈ మైనారిటీలో అత్యధికులు ఆ కూటమికి ఓటెయ్యరు. అంటే 0.7% ఓట్ బ్యాంకున్న పార్టీని కలుపుకుని 10% ఓటు బ్యాంకుని తెదేపా దూరం చేసుకున్నట్టే కదా!!! ఇంత తెలివి తక్కువ పని చంద్రబాబు ఎందుకు చేసాడన్నది చాలామందికి అర్ధం కాని ప్రశ్న. ఒకప్పుడు అపర చాణక్యుడని పేరున్న చంద్రబాబు ప్రస్తుత దశలో ఎంత పిచ్చిమారాజులా మారాడనుకున్నా మరీ ఇంత పిచ్చిదనమా? 

ఏమన్నా అంటే రాష్ట్రప్రయోజనాల కోసం, రేపు తాను సీయం అయ్యాక కేంద్రం నుంచి నిథులు సక్రమంగా రావాలంటే బీజేపీతో పొత్తు తప్పదని చెప్పడం మరొక పెద్ద జోక్. 

ఎందుకంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రైన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తన రాష్ట్రానికి కావాల్సిన నిథులు కేంద్రం నుంచి తెచ్చుకోవట్లేదా? కేంద్రం ఇవ్వనని మారాం చేస్తోందా? 

గత ఐదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి తెచ్చుకోలేదా కేంద్రనిథులు? ఆ మాటకొస్తే ఉత్తరప్రదేశ్ తర్వాత దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు ఆంధ్ర ప్రదేశ్ హైవేల కోసమే కేంద్రం నిథులిచ్చింది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిథులు కూడా కేంద్రం నుంచి విరివిగా అందాయి. ఆ పనులు కూడా జరిగాయి. ఐదేళ్లళ్లో కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రప్రయోజనాలను నెరవేర్చడానికి పనిచేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

తమతో పొత్తు లేకపోయినా జగన్ కి, తమకి ఎగస్పార్టీవాడైన రేవంత్ రెడ్డికి కేంద్రం నిథులిస్తున్నప్పుడు చంద్రబాబుకెందుకు ఆ అనుమానం?

ఎలా చూసుకున్నా మెజారిటీ తెలుగు ప్రజలకి అర్థమౌతున్నది మాత్రం ఒక్కటే. చంద్రబాబుకి కేసుల భయం పట్టుకుంది. మళ్లీ జగనే వస్తాడన్న భయం వెంటాడుతోంది. అదే జరిగితే ఈ సారి తనని, తన కొడుకు లోకేష్ ని కేసుల్లో మూసేసి లోపలేస్తాడేమోనని వణుకు పుడుతోంది. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే బెయిల్ లేకుండా 52 రోజులు జైల్లో ఉన్నాక అన్ని కేసులూ లైన్లోకొస్తే తన పరిస్థితి ఏవిటో ఊహించుకుంటేనే వెన్నుల్లో చలి పుడుతుంది. అందుకే ఆ పరిస్థితి రాకూడదనుకుంటే తనకి తెలిసి తనకున్న ఒకే ఒక్క దారి కేంద్ర బీజేపీకి సరండర్ అయిపోవడం. అందుకే 0.7% ఓట్ షేరున్న పార్టీకి ఏకంగా 6 ఎంపీలు, 10 ఎమ్మెల్యే సీట్లు ధారాదత్తం చేయడం...!

అంటే చంద్రబాబుకి నరేంద్రమోదీ కటౌట్ బాహుబలి మాదిరిగా కనిపిస్తోందా అంటే నిజమే. 

అంతే కాదు, అంత కంటే ఎత్తులో జైల్లో మగ్గుతున్న ఢిల్లీ డెప్యుటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కటౌట్ కూడా కనిపిస్తుండొచ్చు. ఆం ఆద్మీ పార్టీకి చెందిన సిసోడియా ఇరుక్కున్నది ఒక చిన్న లిక్కర్ స్కాములో. కానీ దిక్కు దివాణం లేకుండా, దాదాపు ఏడాదైనా బెయిల్ రాకుండా జైల్లోనే ఉన్నాడు. కేసు ఎంతదైనా కమలనాథులు కన్నెర్ర చేస్తే మటాష్.. అనేది చంద్రబాబుకి అనిపిస్తూ ఉండాలి. 

చంద్రబాబుది తప్పు చేసినవాడి భయంలా కనిపిస్తోంది. తానెన్ని తప్పులు చేసాడో తనకి తెలుసు. అవన్నీ తవ్వి తీసి ఉచ్చు బిగించి రివెంజ్ తీర్చుకోవడానికి జగన్ సిద్ధంగా ఉండడం, అతనికి ప్రజాబలం ఉండడం, కేంద్రం అండ కూడా ఉండడం..వంటి వాటి వల్ల చంద్రబాబు బీజేపీతో పొత్తే తన ఊపిరి అన్నట్టుగా బతికాడు ఇన్నాళ్లు. ఫైనల్ గా పొత్తు కుదిరింది. దీనివల్ల తనకి గెలుపు రాకపోయినా పర్వాలేదు, ఎన్.డీ.యేలో ఉండగలిగితే చాలు...జైలుకు వెళ్లకుండా మోదీ-షా లు కాపాడతారు అని అనుకుంటున్నాడేమో.  

కానీ, "తప్పు చేస్తే ఎన్.డి.ఎ లో ఉన్నవాళ్లని కూడా ఉపేక్షించం"..అనే లాంటి సందేశాన్ని ఇవ్వాలని కేంద్రం అనుకుంటే ఆ కోటాలో బాబు మళ్లీ లోపలికెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు. అది జరగకూడదనుకుంటే తెదేపా భాజపాకి ఇచ్చేసిన 6 ఎంపీ సీట్లతో నిమిత్తం లేకుండా తనకి తానుగా కనీసం పది పదిహేను ఎంపీ స్థానాలు నెగ్గాలి. అప్పటికి కానీ చంద్రబాబుని పట్టించుకునే పరిస్థితి ఉండదు కేంద్ర బీజేపీకి. 

కనుక చంద్రబాబుకి, లోకేష్ కి దీనావస్థలు తప్పాలంటే తెలుగు ప్రజలంతా ఆ పార్టీకి పిచ్చపిచ్చగా ఓట్లేసి సాధ్యమైనన్ని ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలి. లేకపోతే దినదినగండమే తెదేపా అధినాయకుడికి, అతని వారసుడికి. 

ఇదంతా ఎందుకు...ఎంపీ స్థానాలేం ఖర్మ ..అసలు గెలిచేది బాబుగారే..ఆయనే ముఖ్యమంత్రి...వైకాపా పనైపోయింది..అని అంటున్న వాళ్లున్నారు. అదే డెమాక్రసీలో బ్యూటీ. ఎవరు ఎలా అన్నా ఊహించొచ్చు, ఓటేయొచ్చు. అయితే అత్యధికులు ఎటు మొగ్గారు అన్నదాని మీదే గెలుపోటములు ఉంటాయి. రిజల్ట్ వచ్చేదాకా ఎవరు చెప్పేదీ నమ్మాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏమౌతుందో. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?