అనకాపల్లి వైసీపీ ఎంపీ సీటు ఎవరికి?

అనకాపల్లి ఎంపీ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలని టీడీపీ కూటమి డిసైడ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అని ఆ పార్టీ నేతలు లోలోపల సంతోషిస్తున్నారు.…

అనకాపల్లి ఎంపీ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలని టీడీపీ కూటమి డిసైడ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అని ఆ పార్టీ నేతలు లోలోపల సంతోషిస్తున్నారు.

అనకాపల్లిలో నాగబాబు పోటీ అన్నపుడు వైసీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేరు వినిపించింది. మరో దశలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు పరిశీలించారు. ఇపుడు బీజేపీకి సీటు ఇస్తున్నారు అని తేలడంతో మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు.

అనకాపల్లిలో గవర సామాజిక వర్గం బలంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం ఇచ్చారు. ఎంపీ అభ్యర్ధిగా గవర సామాజిక వర్గం నుంచి ఎంపిక చేస్తారు అని అంటున్నారు. ప్రస్తుత ఎంపీ భీశెట్టి సత్యవతి వివాద రహితురాలు. మంచి పేరు ఉంది. మరోసారి ఆమెకే చాన్స్ ఇస్తారని అంటున్నారు.

ఒకవేళ ఆమె కాకపోతే ఎలమంచిలి మునిసిపాలిటీ చైర్ పర్సన్ పీలా రమాకుమారికి ఇస్తారు అని అంటున్నారు. ఈ మధ్యలో మరో ఆసక్తికరమైన పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దించుతారు అని. ఎంపీ పరిధిలో కాపు సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఉంది.

దాంతో పాటుగా చూస్తే కనుక 2014లో అవంతి శ్రీనివాసరావు టీడీపీ తరఫున ఎంపీగా నెగ్గారు. ఆయనకు అక్కడ మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆయనను పోటీకి దించితే సీఎం రమేష్ అయినా మరొకరు పోటీ చేసినా విజయం సునాయాసం అవుతుంది అని అంటున్నారు.

అనకాపల్లి పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లను 2019లో వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే రిజల్ట్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. ఎంపీ అభ్యర్ధి బలంగా ఉంటే అసెంబ్లీ సీట్లు అన్నీ దక్కుతాయని అంచనా వేసుకుంటున్నారు. మరో రెండు రోజులలో ఎంపీ అభ్యర్ధి ఎవరు అన్నది తేలిపోతుంది అని అంటున్నారు.