టీడీపీ తప్పుకుంటే తప్పే అంటున్న తమ్ముళ్ళు!

విశాఖ ఉమ్మడి జిల్లాలో అనకాపల్లికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రాజకీయ కార్య క్షేత్రంగా దీనిని అంతా చూస్తారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఎక్కువ సార్లు అనకాపల్లి ప్రాంతం టీడీపీని ఆదరించింది. అటువంటి అనకాపల్లి…

విశాఖ ఉమ్మడి జిల్లాలో అనకాపల్లికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రాజకీయ కార్య క్షేత్రంగా దీనిని అంతా చూస్తారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఎక్కువ సార్లు అనకాపల్లి ప్రాంతం టీడీపీని ఆదరించింది. అటువంటి అనకాపల్లి లో తొలిసారి టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటోంది అని ప్రచారం సాగుతోంది.

పొత్తులు కట్టి తన కాళ్ళకు సంకెళ్ళు వేసుకుంటున్న టీడీపీ అనకాపల్లిలో రాజకీయంగా దెబ్బ తింటోందని తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొత్తుతో ఇప్పటికే అనకాపల్లి అసెంబ్లీ సీటు జనసేనకు ఇచ్చేశారు. ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ పోటీ చేస్తున్నారు.

ఇపుడు చూస్తే బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కట్టబెడతారు అని అంటున్నారు సీఎం రమేష్ పోటీ చేస్తారు అని అంటున్నారు. అదే జరిగితే టీడీపీ పుట్టాక మొదటిసారి అనకాపల్లిలో సైకిల్ గుర్తు కనిపించదని అంటున్నారు. ఇది రాజకీయంగా గొప్ప తప్పిదమే అవుతుందని తమ్ముళ్ళు అంటున్నారు.

ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యే సీటు నుంచి టీడీపీని పోటీ చేయమని తమ్ముళ్ళు కోరుతున్నారు. ఎంపీ సీటు కూడా మిత్రపక్షానికి ఇచ్చేస్తే అనకాపల్లి ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో చేదు ఫలితాలు వస్తాయని ఒక ఆందోళన అయితే ఉంది. ఈ విషయంలో అధినాయకత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

అయితే పొత్తులు అవసరమని టీడీపీ భావిస్తోంది. బీజేపీకి అనకాపల్లిని కట్టబెట్టి విశాఖ ఎంపీ సీటు తాము తీసుకోవాలని చూస్తోంది. బీజేపీ నేతలు కూడా అనకాపల్లి వద్దు అంటున్నారు. దాంతో రెండు పార్లమెంట్ సీట్లలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అనకాపల్లికి వలస పక్షులు వచ్చి పోటీ చేయడమేంటని కూడా స్థానికంగా అంతా తర్కించుకుంటున్నారు.

విశాఖ ఎంపీ సీటుని జీవీఎల్ నరసింహారావుకు ఇవ్వకుండా చేసేందుకు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఇటు తమ్ముళ్లు సైతం అనకాపల్లిలో పార్టీ ఆలోచనలను విభేదిస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వాలన్న డిమాండ్ ఆ పార్టీ తెస్తోంది. జీవీఎల్ కి టికెట్ ఖరారు చేయాలని కోరుతున్న వారు ఉన్నారు.