వీకెండ్ రిలీజ్.. ఏ సినిమాకు ఎడ్జ్?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ సీజన్ నడుస్తోంది. బడా సినిమాల రాక పూర్తిగా తగ్గిపోవడంతో బాక్సాఫీస్ బోసిపోయింది. దీనికి తోడు గతవారం ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన భీమా సినిమా ఫెయిల్ అవ్వడంతో చాలా…

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ సీజన్ నడుస్తోంది. బడా సినిమాల రాక పూర్తిగా తగ్గిపోవడంతో బాక్సాఫీస్ బోసిపోయింది. దీనికి తోడు గతవారం ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన భీమా సినిమా ఫెయిల్ అవ్వడంతో చాలా థియేటర్లు ఖాళీ అయ్యాయి. ఇలాంటి టైమ్ లో ఒకేసారి అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అన్నీ చిన్న సినిమాలే.

లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా రెడీ చేశాడు సాయిరాం శంకర్. సినిమా పేరు వెయ్ దరువెయ్. నవీన్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా ఈ వారాంతం థియేటర్లలోకి వస్తోంది. రెండున్నర గంటల పాటు పూర్తిస్థాయి వినోదం అందిస్తుందని చెబుతున్నారు మేకర్స్.

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన షరతులు వర్తిస్తాయి సినిమా కూడా శుక్రవారం రిలీజ్ అవుతోంది. మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో పాటు రజాకార్ అనే మరో మూవీ కూడా వస్తోంది. బాబీ సింహా, వేదిక, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే లాంటి నటులు ఇందులో నటించారు.

మాయ, లంబసింగి, తంత్ర అనే మరో 3 సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. భరత్ రాజ్, దివి హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది లంబసింగి. దర్శకుడు కల్యాణకృష్ణ కురసాల ఈ సినిమాతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. లంబసింగికి అతడు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం.

ఇక అనన్య నాగళ్ల లీడ్ రోల్ పోషించిన సినిమా తంత్రం. శ్రీనివాస్ గోపిశెట్టి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సలోనీ కీలక పాత్ర పోషించింది. డిఫరెంట్ ప్రమోషన్స్ తో ఈ హారర్ మూవీ ఓ సెక్షన్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇలా ఈ వారాంతం 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. కామెడీ, హారర్, ఫ్యామిలీ డ్రామా, పీరియాడిక్, లవ్.. ఇలా అన్ని జానర్ల సినిమాలు ఇందులో ఉన్నాయి.