ఎప్పుడూ లేని విధంగా ఈ సారి దాదాపు ఏడాది ముందు నుంచి ఆంధ్రలో ఎన్నికల హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపించేసాయి. దాంతో పవన్ కళ్యాణ్ ఆదికి ముందే వారాహి వేసుకుని జనంలోకి వెళ్లారు. లోకేష్ పాదయాత్ర అన్నారు. చంద్రబాబు కూడా ఓ రౌండ్ వేసారు. కానీ ముందస్తు ఎన్నికల రాలేదు. అయితే ముందస్తు హడావుడి మాత్రం నెలకొంది.
ఎప్పుడూ లేనిది, నోటిఫికేషన్ రాకుండానే దాదాపు అన్ని పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్ధుల మీద కొంత వరకు క్లారిటీ వచ్చింది. తన అలవాటుకు భిన్నంగా చంద్రబాబు ఎన్నికల షెడ్యూలు కన్నా ముందుగానే కొంత మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. జగన్ కూడా దాదాపు పూర్తి జాబితాను ప్రకటించినట్లే. అభ్యర్ధులు అని చెప్పలేదు కానీ ఇన్ చార్జ్ లు అనే కొత్త పేరు పెట్టారు.
ఇలా ఎన్నికల ముందే హడావుడి జరగడంలో ఓ కొత్త వెసులుబాటు కూడా వచ్చిందని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికెేషన్ వస్తే 50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు. అడుగు అడుగునా నిఘా వుంటుంది. అలాగే లిక్కర్ బదిలీ మీద కూడా నిఘా వుంటుంది. ఎప్పుడయితే ఎన్నికల హడావుడి ముందుగానే స్టార్ట్ అయిందో, ప్రధాన పార్టీలు అన్నీ ఎక్కడికి చేర్చాల్సిన డబ్బును అక్కడకు చేర్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఓటర్లకు ఇవ్వాల్సిన తాయిలాలు, నగదు, అలాగే అవసరమైనంత లిక్కర్ మొత్తం అన్ని పార్టీలూ కూడా నియోజకవర్గాలకు చేర్చేసి, నమ్మకమైన వారి దగ్గర వుంచినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇక నగదు, లిక్కర్ పంపిణీ పెద్దగా కష్టం కాకపోవచ్చు. నియోజకవర్గం పరిథిలో అక్కడిక్కడ చేరవేయడం పెద్దగా ఇబ్బంది వుండదు.
ముందుగా హడావుడి నెలకొనడం వల్ల ఓటర్లు, మీడియా, ఇలా అందరి పనీ బాగానే వుంది. ఓటర్లకు రకరకాల సభల పేరు చెప్పి నగదు అందుతోంది. మీడియాను మంచి చేసుకోవడానికి గిఫ్ట్ హ్యాంపర్లు అందిస్తున్నారు. స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్, ఇలా కాదేదే గిఫ్ట్ లకు అనర్హం అన్నట్లు వుంది.
నిజానికి ఈ ముందస్తు హడావుడి స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. దాన్ని వాడుకుని, ఎక్కడిక్కడ ఎక్కువ జాగ్రత్త పడింది వైకాపా. చూడాలి ఇక ముందు ముందు ఎలా వుంటుందో?