‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే’ అనేది సామెత! రాజకీయాలు రాజకీయాలే.. వ్యాపారాలు వ్యాపారాలే అన్నట్టుగానే మన చుట్టు ఉన్న సమాజంలో వ్యవహారాలు ఉంటాయి. రాజకీయంగా పరస్పరం కత్తులు దూసుకుంటూ ఒకే కాంట్రాక్టును కలిసి పంచుకునే, ఒకే మద్యం సిండికేట్ లో భాగస్వాములుగా ఉండే రాజకీయ పార్టీల నాయకులు మనకు అనేకమంది కనిపిస్తారు.
రాజకీయ విభేదాలు వీరికి వ్యాపారాల వద్ద కనిపించవు. అలాంటిది.. పవన్ కల్యాణ్ కు ఒక స్థలం కొనుక్కోవాలంటే, కనీసం ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే.. సుమారు అయిదారేళ్లుగా సాధ్యం కాలేదంటే దానిని ఏమని అనుకోవాలి? కేవలం పవన్ చేతగానితనం, పవన్ కు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి కూడా అక్కడి ప్రజలు ఇష్టపడకపోవడం అనుకోవాలి.
ఈ రకమైన చేతగానితనాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా బయటపెట్టుకున్నారు. భీమవరంలో తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులును పవన్ తన పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనకు ఇప్పుడు భీమవరం టికెట్ కట్టబెడతారేమో కూడా తెలియదు. కానీ.. ఆయనకు తానంటే చాలా ప్రేమ అని, గత ఎన్నికల్లో భీమవరం నుంచి తాను పోటీచేస్తానని తెలిసి ఉంటే.. ముందే ఆయన టికెట్ తీసుకోకుండా తప్పుకుని ఉండే వారంటూ.. కొన్ని ఆత్మవంచనతో కూడిన మాటలు కూడా చెప్పుకొచ్చారు. పనిలో పనిగా అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే, పవన్ ను దారుణంగా ఓడించిన గ్రంథి శ్రీనివాస్ మీద అనేక విమర్శలు కూడా చేశారు.
ఇందులో కీలకం ఏంటంటే- పవన్ కల్యాణ్ భీమవరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా కాలం నుంచి అనకుంటున్నారట. అంటే బహుశా ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి కావొచ్చు. ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నించారట. కనీసం ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలని కూడా అనుకున్నారట. అంతకంటె కనీసం.. ఒక స్థలం దొరికితే కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారట. కానీ.. అక్కడివాళ్లెవరూ ఆయనకు అమ్మడం లేదంట. ఆయనకు అమ్మాలనుకుంటున్న వారినందరినీ ఎమ్మెల్యే భయపెడుతున్నాడట. అందువల్లనే అమ్మడం లేదట… ఇలా చెప్పుకున్నారు పవన్ కల్యాణ్.
భీమవరంలో ఏమైనా పవన్ కల్యాణ్ కు మాత్రం పరిమితమైన ఆర్టికల్ 370 ఉందా? అక్కడి ప్రజలు ఆయనకు అమ్మడానికి ఇష్టపడకపోతే దానిని ఎమ్మెల్యే మీదికి నెడితే ఎలా? గత ఎన్నికల్లో పవన్ ను అభిమానించి 62 వేల మంది ఆ నియోజకవర్గంలో ఓట్లు వేశారు. వారిలో ఒక్కరు కూడా ఆయనకు ఇల్లు కనీసం అద్దెకు కూడా ఇవ్వలేదంటే.. అది ఆయన చేతగానితనమే కదా!
ఇలాంటి చిల్లర మాటలు, భీమవరంలో సొంత ఇల్లు ఉండాలనుకున్నా వంటి చిల్లర అబద్ధపు కోరికలు చెప్పుకుంటూ.. ఇలాంటి విషయాలకు ఎమ్మెల్యేను నిందిస్తూ చేసే చీప్ రాజకీయం గెలిపించదని పవన్ తెలుసుకోవాలి. గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా చేసే తప్పులు ఉంటే చెప్పి ప్రజల ఆదరణ కోరుకోవాలి గానీ.. ఇలాంటి మాటలు పనికి రావని ఆయన తెలుసుకోవాలి.