జానారెడ్డి కమిటీ అసలు ఏం చేస్తున్నట్టు?

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కేటాయించిన తర్వాత, అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత.. అసంతృప్తి తప్పకుండా రేగుతుందనే సంగతి అందరికీ తెలుసు. పార్టీ మౌలిక లక్షణం అది. అందుకే ఈసారి ముఠాలు, అసంతృప్తులు ఉంటే ఊరుకోనని…

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కేటాయించిన తర్వాత, అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత.. అసంతృప్తి తప్పకుండా రేగుతుందనే సంగతి అందరికీ తెలుసు. పార్టీ మౌలిక లక్షణం అది. అందుకే ఈసారి ముఠాలు, అసంతృప్తులు ఉంటే ఊరుకోనని రాహుల్ గాంధీ చాలా కాలం ముందే హెచ్చరించారు. 

అదే సమయంలో.. టికెట్ల కేటాయింపు తుదిదశకు వస్తున్న తరుణంలో పార్టీ ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేసింది. దీనికి ముద్దుగా మనం బుజ్జగింపుల కమిటీ అని పేరు పెట్టుకోవచ్చు. సీనియర్ నాయకుడు జానారెడ్డి సారథ్యంలో, దీపాదాస్ మున్షీ తదితర నాయకులతో.. టికెట్లు రాని నాయకులను బుజ్జగించి పార్టీ వీడిపోకుండా చూసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

అయితే ఇలాంటి కమిటీ ఒకటి ఏర్పాటు అవుతున్నట్లుగా వార్తలైతే వచ్చాయి గానీ.. వాస్తవంలో ఆ కమిటీ ఏం పనిచేస్తోంది? ఏం సాధిస్తోంది? ఎందరితో చర్చించింది? ఎందరిని బుజ్జగించింది? పార్టీ వీడిపోకుండా ఎందరిని నియంత్రించగలిగింది? ఇలాంటి డేటా ఏమైనా ఉన్నదా? లేకపోతే.. బుజ్జగింపుల కమిటీ పేరుతో ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుని, పార్టీ ఎలా పోతే ఏముందిలే అని ఆ కమిటీలో వారంతా ప్రశాంతంగా ఎవరి పనులు వారు చూసుకుంటున్నారా? అనేది కార్యకర్తలకు సందేహంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను కూడా విడుదల చేసిన తర్వాత.. అనేకానేక అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ టికెట్ కు తనను కాదని అజారుద్దీన్ కు కేటాయించినందుకు పి జనార్దనరెడ్డి తనయుడు విష్ణువర్దన్ రెడ్డి అలిగి పార్టికి రాజీనామా చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలో తన పేరు ఉండాల్సిందేనని.. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీచేసి తీరుతానని కూడా ఆయన ప్రకటించారు. ఇంకా తమకు టికెట్ దక్కనందుకు ఆగ్రహిస్తున్న నాయకులు ఒక్కరొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

వీరందరూ ప్రధానంగా చేస్తున్న క్లెయిం ఏంటంటే.. మాకు టికెట్ ఇవ్వకపోతే.. కనీసం ఎందుకు ఇవ్వట్లేదో కూడా చెప్పడం లేదు. పార్టీ నాయకత్వం తరఫున ఎవ్వరూ తమతో ఒక మాటమాత్రంగానైనా సమాచారం చెప్పకుండా నిరాకరించడం అవమానంగా ఉంది. 

అసలు మేము ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేశామా లేదా? చేసిన పనిని పార్టీ గుర్తించిందా లేదా? కూడా అర్థం కావడం లేదు.. అని వాపోతున్నారు. అంటే.. బుజ్జగింపుల జానారెడ్డి కమిటీ అసలు ఏం పని చేయడం లేదేమో అనే అనిపిస్తోంది. కనీసం వారు చురుగ్గా వ్యవహరించి.. ఏదో ఒక తాయిలాలతో ముందుకు వస్తే.. మరికొందరినైనా పార్టీలోంచి వెళ్లిపోనివ్వకుండా చూడొచ్చునని కార్యకర్తలు అనుకుంటున్నారు.