వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగులో రాజకీయం రంజుగా మారింది. వైసీపీ తరపున సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. తాజాగా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో జమ్మలమడుగులో అలజడి చెలరేగింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. జమ్మలమడుగు సీటు తీసుకున్న తర్వాతే వైఎస్సార్ జిల్లాలో అడుగు పెడతానని తన అనుచరులతో అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఆదికి జమ్మలమడుగు సీటు ఖరారైందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో జమ్మలమడుగులో టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులనుద్దేశించి భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలా తాను మెతక మనిషిని కాదన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జమ్మలమడుగు నుంచి పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా జమ్మలమడుగులో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అండగా నిలిచానని గుర్తు చేశారు. పొత్తు పేరుతో క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి సీటు ఇస్తారని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగులో తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. చిన్నాన్న ఆదినారాయణరెడ్డి తనకే మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య జమ్మలమడుగు విషయమై నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడనని ఆయన అన్నారు. అయితే టీడీపీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పడం విశేషం.
ఒకవేళ పొత్తులో భాగంగా టికెట్ బీజేపీకి ఇస్తే… బరిలో వుంటానని పరోక్షంగా టీడీపీ అధిష్టానానికి భూపేష్ సంకేతం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.