ఆ ఒక్కటి అడక్కు.. తేడా చెప్పిన అల్లరోడు

ఆ ఒక్కటి అడక్కు.. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఈ డైలాగ్ కొడుతుంటారు. ఇప్పుడిదే టైటిల్ తో అల్లరి నరేష్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సూపర్ హిట్ డైలాగ్ ను సహజంగానే అల్లరి…

ఆ ఒక్కటి అడక్కు.. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఈ డైలాగ్ కొడుతుంటారు. ఇప్పుడిదే టైటిల్ తో అల్లరి నరేష్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సూపర్ హిట్ డైలాగ్ ను సహజంగానే అల్లరి నరేష్ చెబుతాడని అంతా ఆశించారు. కానీ చిన్న తేడా.

ఆ ఒక్కటి అడక్కు అనే డైలాగ్ ను సినిమాలో హీరో చెప్పడు, హీరోయిన్ చెబుతుంది. ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ లో ఈ క్లారిటీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునే పాత్రలో నటించారు నటకిరిటీ. ఈ కొత్త సినిమాలో మాత్రం జీవితంలో బాగా సెటిల్ అయినా, పెళ్లి కాని కుర్రాడి పాత్ర పోషించాడు అల్లరి నరేష్. అదే ఈ 2 సినిమాల మధ్య తేడా అంటున్నాడు.

టీజర్ విషయానికొస్తే.. చెప్పిన టైమ్ లోగా పెళ్లి కాకపోతే హీరో, జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లే అతని సరిపోయే అమ్మాయి దొరకదు. అలాంటి సమయంలో అతను, ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్ గా తప్పించుకుంటుంది.

ఇలా టీజర్ కాస్త ఫన్నీగా నడిచింది. ఈసారి అల్లరి నరేష్ కు తోడుగా వెన్నెల కిషోర్, వైవా హర్ష కూడా కామెడీ పండించే బాధ్యత తీసుకున్నట్టున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న కామెడీ సినిమా ఇది. పైగా క్లాసిక్ టైటిల్ పెట్టారు.