విశాఖ జిల్లాలో గాజువాక సీటు అంటే 2019 ఎన్నికలు గుర్తుకు వస్తాయి. జనసేన అధినేత ఏరి కోరి మరీ అక్కడ పోటీ చేశారు. దాంతో గాజువాక రాష్ట్ర రాజకీయాలలో మారుమోగిపోయింది. గాజువాకలో చివరికి వైసీపీ గెలిచింది. ఆ తరువాత ఒకటి రెండు సందర్భాలలో తప్ప పవన్ ఆ వైపునకు వెళ్లలేదు ఈసారి పవన్ గాజువాక నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.
ఒకవేళ ఆయన పోటీలో లేకపోయినా సెంటిమెంట్ గా భావించి సీటుని తీసుకుంటారు అని అనుకున్నారు. ఇపుడు చూస్తే సీట్ల సర్దుబాటులో గాజువాక సీటు జనసేన వదులుకుంటోంది అన్న ప్రచారం సాగుతోంది. అక్కడ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూటమి తరఫున పోటీ చేస్తారు అని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నాలుగు సీట్లు పొత్తులో భాగంగా దక్కనున్నాయని అంటున్నారు.
అందులో అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, విశాఖ సౌత్ కానీ భీమిలీ కానీ ఉంటాయని ప్రచారం సాగుతోంది. దీంతో గాజువాక సీటు తమకే దక్కుతుందని భావించిన జనసేన వర్గాలు ఖంగు తింటున్నాయి. ఈ సీటు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సిందే అని తీర్మానం కూడా చేసి పంపాయి. ఒకవేళ పవన్ పోటీకి నిరాకరిస్తే బలమైన అభ్యర్ధిగా జనసేన నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే గాజువాక మీద టీడీపీ కర్చీఫ్ వేసేసింది అని అంటున్నారు.
టీడీపీ ఈ సీటుని వదులుకోదని అంటున్నారు. రెండవ జాబితాలో గాజువాక సీటు మీద పూర్తి స్పష్టత వస్తుందని అంటున్నారు. గాజువాకను జనసేన వదులుకుంటే మాత్రం ఓడిన చోటనే గెలిపించుకుంటామన్న జనసైనికులు హర్ట్ అయినట్లే అంటున్నారు.