ఉమ్మడి ఏపీ విభజన ఏపీ కలిపి దాదాపుగా పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పాలిచిన చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి వెంపర్లాడడం దారుణం అని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బొత్స బాబు తీరు ప్రజలు చూసి అసహ్యించుకునేలా ఉందని అన్నారు. బాబు పొత్తులు లేకపోతే ఉండలేరా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో బాబు పొత్తు కొత్తదేమీ కాదని ఆయన అన్నారు.
గతంలో బీజేపీతో కలిశారు. అపుడు విడిపోయారు. ఆనాడు బీజేపీని బాబు ఎన్ని మాటలు అన్నారో అందరికీ గుర్తుందని బొత్స చెప్పుకొచ్చారు. గతంలో ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయడం లేదని బీజేపీతో పొత్తుని వదులుకున్నాను అని చెప్పిన చంద్రబాబు ఇపుడు ఎందుకు కలిశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంటి ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా సహా విభజన హామీల మీద బాబు బీజేపీ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్స నిలదీశారు. మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చినా వైసీపీకి నష్టం ఏమీ లేదని గెలిచేది తమ పార్టీయే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు కాదు ముప్పయి పార్టీలను కలసి రమ్మనండి అని ఆయన సవాల్ చేసారు తాను వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తున్నానని బొత్స చెప్పారు. బొత్స విశాఖ జిల్లా భీమిలీ నుంచి పోటీ చేస్తారు అన్న వార్తలు వచ్చాయి. అలాంటిది ఏదీ లేదని బొత్స కొట్టిపారేశారు.