చిన్నమ్మ అలిగారా? మరిది ఇంటికి రానన్నారా?

తన తండ్రికి వెన్ను పోటు పొడవడానికి, తన భర్తను ఒక పావులాగా, ఆయుధంలాగా వాడుకుని.. ఆ తర్వాత ఆయనను కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటే.. బహుశా దగ్గుబాటి పురందేశ్వరికి తీవ్రమైన అసహ్యమే ఉండవచ్చు.…

తన తండ్రికి వెన్ను పోటు పొడవడానికి, తన భర్తను ఒక పావులాగా, ఆయుధంలాగా వాడుకుని.. ఆ తర్వాత ఆయనను కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటే.. బహుశా దగ్గుబాటి పురందేశ్వరికి తీవ్రమైన అసహ్యమే ఉండవచ్చు. లేదా, పొత్తు చర్చల పేరు మీద తగుదునమ్మా అంటూ మరిది ఇంటికి వెళ్లి మర్యాదలు స్వీకరిస్తే.. ఇన్నాళ్లూ తాను ఆయన తరఫున కోవర్టులాగా బిజెపిలో ఉంటూ, ఆయనకు ఎడ్వాంటేజీలు సృష్టించడం కోసం జగన్ ను తిట్టే రాజకీయం నడిపించినట్టుగా వెల్లువెత్తిన విమర్శలు నిజమవుతాయనే సంకోచం కూడా ఉండవచ్చు. మొత్తానికి బీజేపీ సారథి దగ్గుబాటి పురందేశ్వరి ఉండవిల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన తుదివిడత పొత్తు చర్చలకు గైర్హాజరయ్యారు. 

రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మరో జాతీయ నేత బైజయంత్ పాండా మాత్రమే పాల్గొన్నారు. అదే జనసేన తరఫున పవన్ కల్యాణ్, ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. తెలుగుదేశానికి చంద్రబాబునాయుడు సరే, అచ్చెన్నాయుడుతో కలిసి అనగాని సత్యప్రసాద్ వంటి వారు కూడా ఒక దశ వరకు ఉన్నారు. కానీ, చిన్నమ్మ పురందేశ్వరి మాత్రం, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ.. ఆమె ఆ భేటీకి హాజరు కాలేదు. 

ఆమె గైర్హాజరుపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీగా పోటీచేసి నెగ్గితే.. కేంద్రమంత్రి కావచ్చునని ఆశపడుతున్న పురందేశ్వరి తాను అడిగిన సీటును బిజెపికి కేటాయించేందుకు తెదేపా సుముఖంగా లేని కారణంగానే అలిగి హాజరు కాలేదనేది ఒక వాదన. అదే సమయంలో.. తండ్రిని వెన్నుపోటు పొడిచిన, భర్తను వంచించిన చంద్రబాబు ఇంటిలో అడుగుపెట్టే ఉద్దేశమే ఆమెకు లేదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇలాంటి ఊహాగానాలు ఎన్నయినా ఉండవచ్చు గానీ.. రాష్ట్ర కమల నాయకులను పార్టీ అధిష్ఠానం చాలా చులకనగా చూసినదనే వ్యాఖ్య మాత్రం పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. పొత్తు చర్చలకు కనీసం ఒక్క బిజెపి లోకల్ నాయకుడు కూడా లేకుండా.. ఇద్దరు జాతీయ నేతలు మాత్రం డిసైడ్ చేయడం వారికి అవమానకరంగా ఉంది. కమలదళంలోని మోనార్క్ పోకడలకు ఇది నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అసంతృప్తులు వారిలో ఎన్ని ఉన్నప్పటికీ.. మోడీ, షా ల నిర్ణయానికి ఎదురుచెప్పగల స్థితిలో ఏ ఒక్కరు కూడా లేరు. అందుకే బిజెపి ఇంతగా విర్రవీగుతున్నదని కూడా ప్రజలు అనుకుంటున్నారు.