భారతీయ జనతా పార్టీ ఒక్క మెట్టు కూడా దిగలేదు. పొత్తుల గురించిన చర్చలు ఢిల్లీలో ప్రారంభం అయినప్పుడు తమకు ఎన్ని సీట్లు కావాలని వారు పట్టుబట్టారో.. పొత్తులు, సీట్ల పంపకాలు ఒక కొలిక్కి వచ్చిన తుది విడత చర్చల్లో కూడా అదే సంఖ్య దగ్గర ఉన్నారు. వారు ఒక్క మెట్టు కూడా దిగలేదు.
భాజపా అడిగినన్ని స్థానాలను ఇవ్వడానికి ఇటు తెలుగుదేశం, అటు జనసేన ఇద్దరూ కూడా రాజీపడాల్సి వచ్చింది. కమలం పార్టీ తన సత్తా ఏమిటో చూపించింది. ఆ పార్టీ కోసం ఈ ఇద్దరూ ఎంత ఆరాటపడుతున్నారో కూడా తెలుగు ప్రజలకు తెలిసి వచ్చింది.
జనసేన- తెలుగుదేశం ఇద్దరూ బంధం కుదుర్చుకున్నాక కూడా బిజెపి వారితో జట్టు కట్టడానికి చాలా కాలం అవసరమైంది. తెలుగుదేశంతో అసలు కలవడం అవసరమా? అనే మీమాంసలో వారు జాగు చేస్తూ వచ్చారు.
ప్రధానిగా నరేంద్రమోడీకి ఉన్న ప్రజాదరణను కూడా తనకోసం వాడుకుంటే తప్ప గెలిచే అవకాశం లేదని గ్రహించిన చంద్రబాబునాయుడు వారి నిర్ణయం కోసం చివరివరకు ఎదురుచూశారు. పవన్ ద్వారా రాయబారం నడిపారు. బిజెపిలోని తన కోవర్టులను కూడా ప్రయోగించారు. ఇన్నిచేసినా రిజల్టు చాలా ఆలస్యంగానే వచ్చింది.
చివరివిడతగా పవన్, చంద్రబాబు కలిసి ఢిల్లీలో తిష్టవేసి బిజెపితో మంతనాలు ప్రారంభించిన తొలినాటినుంచి వారు 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు సీట్లకే పట్టుపడుతూ వచ్చారు. అసెంబ్లీల్లో రాజీపడతారు గానీ, పార్లమెంటు 6 కోసం పట్టుదలగా ఉన్నట్టు పచ్చమీడియా రాసింది. కానీ బిజెపి ఎందులోనూ రాజీపడలేదు.
ఢిల్లీ చర్చల్లో చంద్రబాబు బిజెపి-జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 8 ఎంపీ ఇస్తానని తేల్చేశారు. వారిలో వారు కొట్టుకోమని వదిలేశారు. అప్పటికే జనసేన 24 + 3 అని ప్రకటిఉన్న నేపథ్యంలో బిజెపికి 6+5 మిగులుతాయని ప్రచారం జరిగింది.
కానీ ఫైనల్ గా ఉండవిల్లి చంద్రబాబునాయుడు నివాసంలో తుదిచర్చలకు కూర్చున్నప్పుడు.. బిజెపి ఏమాత్రం పట్టు సడలించలేదు. చంద్రబాబు కూడా ఒక మెట్టు దిగి.. 30 అన్నది కాస్తా 31 సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. పవన్ కల్యాణ్ చాలా మెట్లు దిగి.. 24 అన్నది కాస్తా 21 స్థానాలకు పరిమితం కావడానికి ఒప్పుకున్నారు. అలాగే ఆయన ఒక ఎంపీసీటును కూడా త్యాగం చేశారు.
మొత్తానికి ఈ రెండు పార్టీలు తన మీద డిపెండ్ అయి ఉన్నాయని గ్రహించిన బిజెపి.. తాను అనుకున్నన్ని సీట్లను సాధించుకుంది.