టాలీవుడ్ లో హీరోలంతా ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఓవైపు ప్రభాస్ లాంటి హీరోలు ఏళ్లుగా బ్రహ్మచర్యాన్ని కొనసాగిస్తుంటే.. మరోవైపు నితిన్, నిఖిల్, నాగశౌర్య, శర్వానంద్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరబోతున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరం త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. హీరోయిన్ రహస్యను అతడు పెళ్లాడబోతున్నాడు. బుధవారం వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ జరగనుంది.
రాజావారు రాణిగారు సినిమాతో కలిశారు కిరణ్ అబ్బవరం, రహస్య. అప్పుడే వాళ్లిద్దరి మధ్య ఓ బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత అదే ప్రేమగా మారింది. అలా కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది.
ఈ నిశ్చితార్థం పూర్తిగా ప్రైవేట్ ఎఫైర్ గా జరగనుంది. ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి తేదీని ప్రకటిస్తారు. రెండు కుటుంబాల్ని ఒప్పించి మరీ కిరణ్ ఈ పెళ్లి చేసుకుంటున్నాడు.
కెరీర్ లో ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేకపోయాడు కిరణ్ అబ్బవరం. తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, ఎస్ఆర్ కల్యాణమండపంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత మైత్రీ, గీతా లాంటి బడా బ్యానర్లలో సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయాడు.
గతేడాది రూల్స్ రంజన్ సినిమాను రిలీజ్ చేసిన కిరణ్, ఈ ఏడాదికి ఇప్పటివరకు ఇంకా సినిమాను సిద్ధం చేయలేదు. ఈ గ్యాప్ లో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నాడు.