బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవడంపై మొదటిసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఇప్పటికే సీపీఎం తీవ్రస్థాయిలో మండిపడింది. చంద్రబాబుపై సానుకూలంగా ఉండే సీపీఐ మాత్రం ఎట్టకేలకు ఆవేదనతో స్పందించడం గమనార్హం. ఇవాళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును బెదిరించి లొంగదీసుకున్నారని వాపోయారు.
దేశంలో బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, జగన్లను మోదీ, అమిత్షా పథకం ప్రకారం జైళ్లకు పంపారని విమర్శించారు. అవినీతి కేసులకు భయపడిన వాళ్లే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. జగన్, చంద్రబాబు పోటీలు పడి మరీ మోదీ సర్కార్కు మద్దతు పలుకుతున్నారన్నారు. మోదీ అంటే భయపడే ఇద్దరు నాయకులు మద్దతు ఇస్తున్నట్టు రామకృష్ణ ఆరోపించారు.
ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా పోటీ చేసినా అందరూ ఢిల్లీలో మోదీకే ఓట్లేస్తారని ఆయన విమర్శించారు. ఏపీలో ప్రత్యర్థులుగా వుంటూ, ఢిల్లీలో మాత్రం అందరూ మిత్రులుగా వుంటారని ఆయన దెప్పి పొడిచారు.
మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని ఏపీలో మాట్లాడ్తారే తప్ప, ఢిల్లీలో నోరు మెదపడం లేదన్నారు. లోక్సభ, రాజ్యసభల్లో టూ థర్డ్ మెజార్టీ వస్తే బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని ఆయన తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.