విశాఖ వేదికగా మోడీతో ఆ ఇద్దరూ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో ఈ నెల 16న పర్యటించనున్నారు. ఆ రోజున విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో జరిగే సభతో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభిస్తారు. 2019 ఎన్నికల ముందు సరిగ్గా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో ఈ నెల 16న పర్యటించనున్నారు. ఆ రోజున విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో జరిగే సభతో ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభిస్తారు. 2019 ఎన్నికల ముందు సరిగ్గా మార్చి నెలలోనే మోడీ విశాఖ వచ్చి సభ పెట్టి వెళ్లారు.

అప్పట్లో ఇదిగో రైల్వే జోన్ అని ఒక జీవో కాపీని కూడా చూపించారు. అయితే జోన్ ఈ రోజుకీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కానీ విశాఖ నుంచి మొదలెట్టిన బీజేపీ ఎన్నికల ప్రచారం ఆ పార్టీకి శుభారంభంగా మారింది. దాంతో బీజేపీ దేశంలో రెండవ మారు గెలిచి అధికారాన్ని దక్కించుకుంది.

ఇప్పుడు కూడా బీజేపీ అదే సెంటిమెంట్ తో విశాఖ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలెడుతోంది. ఈ నెల 17న గుంటూరు జిల్లా చిలకూరిపేటలో జరిగే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు అని ఇప్పటిదాకా వినిపించిన సమాచారం.

దాని కంటే ఒక రోజు ముందే బీజేపీ సభను విశాఖలో పెట్టి చంద్రబాబుని పవన్ ని బీజేపీ పెద్దలే ఆహ్వానిస్తున్నారు. అలా తాము పెద్దన్న పాత్రలో ఉంటూ ఏపీలో జరిగే సభకు మిత్రులను పిలుస్తున్నారు అన్న మాట.

టీడీపీ ఆధ్వర్యంలో జరిగే చిలకలూరిపేట సభ ప్రధాని పాల్గొనే రెండవ సభ అవుతుంది. అలా ఉత్తరాంధ్రాలో ఒక సభ, కోస్తాలో రెండవ సభలో మోడీ పాల్గొంటారు అని తెలుస్తోంది. అదే విధంగా రాయలసీమలో మూడవ సభ కూడా ఇదే పర్యటనలో ప్రధానిది ఉంటుందని అంటున్నారు.

విశాఖ సభలో మోడీ చంద్రబాబు పవన్ పాల్గొనడం బాగానే ఉంటుంది. కానీ రైల్వే జోన్ ఊసు లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేదీ కాదు, దీంతో వీటికి సమాధానం ఈ ముగ్గురు మిత్రులలో ఎవరు ఇస్తారు అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖ సభ 2019లో హిట్ అయి ఉండవచ్చునని 2024లో మాత్రం చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.