మరక పడితే పడింది.. నిధులు దండుకోవచ్చు!

తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి? మరక పడకుండా, మచ్చ తెచ్చుకోకుండా రాజకీయాల్లో గెలుపు సాధించాలనే ఉద్దేశం వారికి ఉందా? లేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వేస్తున్న అడుగులు, అనుసరిస్తున్న వ్యూహాలు గమనిస్తే.. తమకు…

తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి? మరక పడకుండా, మచ్చ తెచ్చుకోకుండా రాజకీయాల్లో గెలుపు సాధించాలనే ఉద్దేశం వారికి ఉందా? లేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వేస్తున్న అడుగులు, అనుసరిస్తున్న వ్యూహాలు గమనిస్తే.. తమకు చెడ్డపేరు వచ్చినా పర్లేదు గానీ, ఈ ఎన్నికల రూపేణా ‘ఇతర ప్రయోజనాలు’ బోలెడన్ని నెరవేర్చుకోవచ్చునని ఆ పార్టీ యోచిస్తున్నది.

మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, ఆయన కొడుకు మాగుంట రాఘవ్ కు ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది ఈ సమయంలో పార్టీ పరువును కూడా భ్రష్టుపట్టించే వ్యవహారమే గానీ.. ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకోవడం వలన నిధులు భారీగా సమకూర్చుకోగలం అనే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ఉంది.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనను గెలిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు, ప్రజల్లో ఆదరణ లేకపోవడం అనే ప్రాతిపదిక మీద ఆయనకు తిరిగి టికెట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరస్కరించిన నేపథ్యంలో చాలాకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న మాగుంట ఇటీవల రాజీనామా చేశారు. రెండు మూడురోజుల్లో ఆయన తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు పలువురు మాగుంట ఇంటికి వెళ్లి ఆయనతో పర్సనల్ గా భేటీ అయి మంతనాలు సాగించారు.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాగుంట కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోవడానికి, మాగుంట రాఘవ్ కు టికెట్ ఇవ్వడానికి ఎవరైనా వెనకాడతారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధారుల్లో ఒకరుగా మాగుంట రాఘవ్ పేరు దేశమంతా మార్మోగిపోయింది. అరెస్టు కూడా అయ్యారు. వందలకోట్ల రూపాయలు స్వాహా చేసిన స్కామ్ లో ఆయన పాత్ర నిగ్గు తేలింది.

ఆ తర్వాత ఇతర నిందితుల్ని మరింత ఘాటుగా ఇరికించడానికి ఆయన అప్రూవర్ గా మారి ఉండొచ్చు గాక. అంతమాత్రాన చేసిన పాపం ప్రక్షాళన అయిపోదు కదా! అంతటి అవినీతి మరక పడిన తర్వాత.. ఎవ్వరైనా సరే మాగుంట రాఘవ్ కు టికెట్ ఇవ్వడం గురించి ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ తెలుగుదేశం మాత్రం ఆయనకు ఎగబడి టికెట్ ఇవ్వడానికి పూనుకుంటోంది.

మాగుంట కుటుంబాన్ని తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఇంకా పార్టీలో చేరనేలేదు గానీ.. తనను కలిసిన తెలుగుదేశం నేతలతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఈసారి ఎన్నికల్లో తన కొడుకు పోటీ చేస్తాడని ముందే చెప్పేస్తున్నారు. అంటే, పార్టీలో చేరక ముందే ఆయన తన కొడుక్కి తానే టికెట్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఈ ధీమా.. కేవలం ఆర్థిక వనరుల వల్ల మాత్రమే వస్తున్నదని అనుకోవాలి.

తెలుగుదేశం కూడా మాగుంట కుటుంబాన్ని చేర్చుకుంటే.. వచ్చే చెడ్డపేరు సంగతి తర్వాత.. వారినుంచి దండిగా నిధులు దండుకోవచ్చుననే ఆశతోనే ఇలా చేస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.