జనసేన కార్యకర్తలు, నాయకులకు మరో పరాభవం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూరల్ టికెట్ ప్రకటించినా, చంద్రబాబునాయుడు ఒత్తిడికి పవన్‌కల్యాణ్ తలొంచక తప్పలేదు. రాజమండ్రి రూరల్‌లో ఏళ్ల తరబడి ప్రజానీకానికి సేవ చేస్తూ, ఆదరణ పొందిన కందుల దుర్గేష్‌ను ఏ మాత్రం సంబంధం లేని నిడదవోలుకు పవన్ బలవంతంగా పంపడం జనసేన శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
తాజాగా జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. నిడదవోలు నుంచి కూటమి తరపున కందుల దుర్గేష్ పోటీ చేస్తారని ఆ ప్రకటన సారాంశం. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిర్ణయం మేరకు నిడదవోలు జనసేన అభ్యర్థిగా దుర్గేష్‌ను ఎంపిక చేసినట్టు పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా కమ్మ నాయకుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోసం కందుల దుర్గేష్‌ను బలిపశువు చేశారనే ఆగ్రహం కాపుల్లో వెల్లువెత్తుతోంది. రాజమండ్రి రూరల్ టికెట్ మీకే అని, బాగా చేసుకోవాలని ఆ మధ్య రాజమండ్రి పర్యటనలో పవన్ దిశానిర్దేశం చేశారు. దీంతో కందుల దుర్గేష్ అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాజమండ్రి రూరల్‌లో గెలుస్తామనే ధీమా వారిలో కనిపించింది.
అయితే ఈ ప్రచారంపై ఎవరూ నమ్మొద్దని, తనకు కాకుండా కందులకు టికెట్ ఇచ్చే ప్రశ్నే లేదని సిటింగ్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. దీంతో తమ నాయకుడి నోటికాడికి వచ్చిన టికెట్ ఎక్కడ చేజారిపోతుందనే అని దుర్గేష్ అనుచరులు రోజుల తరబడి వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. కమ్మ నాయకుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోసం తమ నాయకుడిని నిడదవోలుకు వెళ్లమంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని జనసేన అభిమానులు, కాపులు నిరసన కార్యక్రమాల్లో హెచ్చరించారు. అయినప్పటికీ వారి గోడును పవన్‌కల్యాణ్ పట్టించుకోలేదు.
తన సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోసం చంద్రబాబు గట్టిగా నిలబడ్డారని, తన సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ కోసం ఆ పని పవన్‌కల్యాణ్ ఎందుకు చేయలేకపోయారని కార్యకర్తలు, కాపులు నిలదీస్తున్నారు. ముమ్మాటికీ ఇది కమ్మ చేతిలో కాపు ఓటమిగానే చూడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలుకు కందుల దుర్గేష్‌ను పంపి, రాజకీయంగా బలి పెట్టడానికి బాబు సామాజిక వర్గం వేసిన ఎత్తుగడగా కందుల దుర్గేష్ సామాజిక వర్గీయులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్‌తో పాటు రాజమండ్రి సిటీ, చుట్టు పక్కల నియోజక వర్గాల్లో తమ సామాజిక వర్గం సత్తా ఏంటో టీడీపీకి రుచి చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.