బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చింది తమ నాయకుడు పవన్‌కల్యాణే అని జనసేన కార్యకర్తలు, నాయకులు చెబుతుంటారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ పార్టీకి టీడీపీని చేరువ చేయడానికి తాను తిట్లు తినాల్సి వచ్చిందని పవన్‌కల్యాణ్ బహిరంగంగా అన్నారు. ప్లీజ్, ప్లీజ్ అని బీజేపీ పెద్దల్ని ప్రాథేయ పడాల్సి వచ్చిందని పవన్‌కల్యాణ్ ఏదీ దాచుకోకుండా బయటికి చెప్పేశారు.
అయితే బీజేపీతో టీడీపీ పొత్తు వెనుక వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని టీడీపీ అనుమానిస్తోంది. గతంలో అమిత్‌షాతో చంద్రబాబునాయుడు భేటీ అయిన వెంటనే వైఎస్ జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని బీజేపీ పెద్దలు మాట్లాడ్డాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు బీజేపీతో పొత్తు వెనుక జగన్ ఉన్నారనే టీడీపీ అనుమానం వెనుక బలమైన కారణం వుంది.
బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి వచ్చే రాజకీయ ప్రయోజనం గుండు సున్నా. అంతేకాదు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలతో పాటు అణగారిన వర్గాల ఓటర్లు టీడీపీకి 90 శాతం దూరమవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాల్లో కూడా ఓడిపోతామన్న భయం టీడీపీ నేతల్లో వుంది.
ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పీలేరు, అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజక వర్గాల్లో టీడీపీకి భారీ నష్టం కలగనుంది. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గెలుపోటములను నిర్ణయించనున్నారు. ఇవి మచ్చుకు కొన్ని నియోజక వర్గాలు మాత్రమే. పొత్తు ధర్మంగా బలం లేకపోయినా బీజేపీకి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. బీజేపీకి ఇచ్చే సీట్లు చాలా తక్కువ. కేవలం 6 అసెంబ్లీ, అంతే సంఖ్యలో లేదా ఒకటి తక్కవ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ, ఆ పార్టీతో పొత్తు ఎఫెక్ట్ టీడీపీపై తీవ్రంగా వుండనుంది.
అందుకే బీజేపీతో పొత్తు వద్దే వద్దని టీడీపీ నేతలు చంద్రబాబుతో నెత్తీనోరూ కొట్టుకుని మరీ చెప్పారు. కానీ బీజేపీతో పొత్తు లేకపోతే అసలు ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోలేమని చంద్రబాబు భయపడ్డారు. బీజేపీతో పొత్తు చివరికి టీడీపీ ఓటమికి దారి తీసేలా వుందని… క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణులకు భయం పట్టుకుంది. అందుకే టీడీపీని శాశ్వతంగా దెబ్బ కొట్టేందుకే బీజేపీతో టీడీపీ పొత్తు కుదిర్చారనే అనుమానాలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో బలంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇంత కాలం సఖ్యతగా ఉన్న బీజేపీ, ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసే చర్యలు తీసుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు. అనవసరంగా బీజేపీ కబంధ హస్తాల్లో ఇరుక్కున్నామనే అసంతృప్తి, అసహనం టీడీపీ శ్రేణుల్లో చూడొచ్చు.