ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ వైసీపీ ప్రచారంలో దూసుకెళుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నేతలు పొత్తు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. జనసేన 24 అసెంబ్లీ, బీజేపీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీతో పొత్తు ఖరారైంది.
బీజేపీ కేవలం ఆరు అసెంబ్లీ, అలాగే ఐదు లేదా ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేనకు కేటాయించిన 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై ఎక్కువ చర్చ జరుగుతోంది. జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజానీకం మరీ ముఖ్యంగా ఆ రెండు పార్టీల సీట్లపైనే మాట్లాడుకుంటున్నారు.
వైసీపీ ఖాతాలో అప్పనంగా 25 అసెంబ్లీ, 7 పార్లమెంట్ స్థానాలు పడినట్టే అని ఏ నోట విన్నా వినిపిస్తోంది. బీజేపీ, జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ సహకరించే పరిస్థితి ఎంత మాత్రం లేదని అంటున్నారు. ఇంకా బీజేపీకి కేటాయించే సీట్లు, నియోజక వర్గాలపై స్పష్టత లేదు. అలాగే జనసేనకు సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. ఇంకా 19 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.
బీజేపీ, జనసేన లోక్సభ అభ్యర్థులను పక్కన పెడితే, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం గొడవలు తప్పవు. తమ పార్టీని పొత్తులే ముంచనున్నాయని టీడీపీ నేతలు వాపోతున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా, గెలుపుపై భరోసా వుండేది. ఇప్పుడు జనసేన, బీజేపీ కలవడంతో కొన్ని చోట్ల వాటికి బలం లేకున్నా, పొత్తులో భాగంగా తప్పని సరి పరిస్థితుల్లో సీట్లు ఇవ్వాల్సి వచ్చింది.
జనసేనతో పొత్తు వల్ల మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఓట్ల బదిలీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ-జనసేన మధ్య నివురుగప్పిన నిప్పులా వుంది. ఎన్నికల్లో దాని ప్రభావం చూపనుంది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం, క్రిస్టియన్, దళిత, గిరిజన ఓట్లు టీడీపీ కూటమికి పూర్తిగా దూరం కానున్నాయి. ఇవన్నీ వైసీపీకి కలిసొచ్చే అంశాలు. అధికారంలోకి రావాలంటే 88 సీట్లు అవసరం.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 145 సీట్లలో వైసీపీకి కావాల్సింది 63 మాత్రమే. ఎటూ 30 సీట్లలో 25 వరకూ వైసీపీకి దక్కుతాయనేది రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజానీకం, తటస్థ జర్నలిస్టుల అభిప్రాయం. లోకం అభిప్రాయం ఎలా ఉన్నా, కాలం అన్నింటికి జవాబు చెప్పడానికి సిద్ధంగా వుంది.