Advertisement

Advertisement


Home > Politics - Opinion

అంద‌మైన మోసం

అంద‌మైన మోసం

సినిమా ఒక భ్రాంతి, అంద‌మైన మోసం. నిజానికి జీవితం కూడా అంతే! సినిమా, జీవితం రెండూ ఒక‌టేనా? కానే కాదు. సినిమాలో రంగులుంటాయి. జీవితంలో కూడా వుంటాయి. కానీ గుర్తు ప‌ట్ట‌కుండా జీవిస్తాం. దాన్ని సాధ‌న చేసి జీవ‌న క‌ళ‌గా కూడా ప్ర‌చారం చేస్తాం. సినిమాలో సంగీతం వుంటుంది. జీవితంలో వుంటే అది ఒక ధ్వ‌ని మాత్ర‌మే. కెమెరా ర‌క‌ర‌కాల కోణాల్లో చూపిస్తే  సినిమా. జీవితంలో క‌ళ్లే కెమెరాలు. అంత‌కు మించి ప్ర‌పంచంలో ఎవ‌రూ క‌నిపెట్ట‌లేదు. చూసే వాడిని బ‌ట్టి కోణం మారుతుంది.

తెర మీద చూసేది నిజం కాదు. క‌ళ్ల‌తో చూసేది, చెవుల‌తో వినేది కూడా పూర్తిగా నిజం కాదు. అన్నీ అర్ధ స‌త్యాలే. సంపూర్ణమంటూ లేనే లేదు. శుద్ధ స‌త్యం అస‌లు లేదు.

తెర దించిన త‌ర్వాత లైట్లు వెలుగుతాయి. ప్రేక్ష‌కుడు నెమ్మ‌దిగా వెళ్తాడు. శూన్యంలోకి, లేదా స‌మూహంలోకి, గుంపులో ఆవ‌రించే ఒంట‌రిత‌నంలోకి. జీవితంలో తెర‌ప‌డితే వెలుగు లేదు. అంతా చీక‌టే. త‌న‌కే తెలియ‌ని అనంతంలోకి ప్రేక్ష‌కుడు వెళ్లిపోతాడు. చ‌క్ర‌వ‌ర్తుల‌కి, భిక్ష‌గాళ్ల‌కి కాటికాప‌రి ఒక‌డే.

సినిమా ఎప్పుడు శుభం ప‌డుతుందో తెలుసు. జీవితంలో తెలిసే చాన్స్ లేదు. హ‌ఠాత్తుగా బొమ్మ ఆగిపోతుంది. చాలా వుంద‌నుకున్న వాళ్ల‌కి నిష్క్ర‌మ‌ణ‌. ముగిసింద‌నుకుంటే పొడిగింపు. ఆప‌రేట‌ర్‌కి త‌ల తిక్క‌. అబ్స‌ర్డ్‌మాన్. అసంగ‌తాల క‌ల‌బోత‌. స‌న్నివేశాలు తారుమారు చేస్తాడు.

ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మిన్ బ‌ట‌న్ సినిమాలోలా ముస‌లిత‌నంతో పుట్టించి, కుర్రాళ్ల‌గా మారుస్తాడు. డాక్ట‌ర్ జ‌కిల్‌ని మిస్ట‌ర్ హైడ్‌గా మార్చేది కూడా వీడే. ఒకానొక రాత్రి, ప్ర‌శాంతంగా నిద్రిస్తున్న గంగ‌ చంద్ర‌ముఖిగా మారితే అది వీడి చ‌లువే. అప‌రిచితుడు, చంద్ర‌ముఖి క‌లిసి జీవించ‌డ‌మే ఆధునిక జీవన విధానం, వైవిధ్యం.

ఎంత చెత్త సినిమాకైనా ఒక ఆర్డ‌ర్ వుంటుంది. జీవితం మ‌రీ చెత్త‌. దానికి ఏ ఆర్డ‌రూ వుండ‌దు. "లా" అస్స‌లు వుండ‌దు. క్లైమాక్స్‌తో మొద‌లై చైల్డ్ హుడ్‌తో ముగుస్తుంది. హీరోయిన్ లేని డ్రీమ్ సాంగ్ చూపిస్తుంది. నువ్వు హీరో అంటే చ‌చ్చినా ఒప్పుకోదు. విల‌న్ లేదా క‌మెడియ‌న్‌గా ఫిక్స్ చేస్తుంది. నిరంత‌రం నువ్వో ప‌ది మందితో ఫైట్ చేస్తుంటావు. క‌ళ్లు తెరిచి చూస్తే ఆ ప‌ది మంది నువ్వే.

మైమ్, మిమిక్రీ రెండూ ఏక‌కాలంలో నువ్వే. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కూడ‌ద‌ని మేక‌ప్ వేసుకుని అద్దంలో చూసిన ప్ర‌తిసారీ ఈ ఆరో భూతం ఎవ‌ర‌ని జ‌డుసుకుంటూ వుంటావు.

భ్రాంతి, మోసం, అజ్ఞానం, అకాలం అన్నీ నువ్వే. నీ అంత‌టి న‌టుడు భూమి మీద లేడు. కెమెరా ముందు గోరంతే, లేకుండా జ‌రిగేది కొండంత‌.

చేప‌కి ఈత‌లా, మ‌నిషికి న‌ట‌న స‌హ‌జం. అదిప్పుడు వైపై, లేకుండా జీవించ‌లేం. మూల్యం చెల్లించి మ‌రీ న‌టించాలి.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?