రాయలసీమ నుంచి, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేయవచ్చునని చాలా చాలా ప్రచారం జరిగింది. అయితే.. పవన్ అంత సాహసానికి ఒడిగట్టడం లేదు. కేవలం కాపుకులం ఓట్లను నమ్ముకుని, ఆ కులం ఓట్లు మెజారిటీ ఉన్న చోటనుంచే బరిలో దిగాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ కు తిరుపతి అంత సేఫ్ గా కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పోటీచేస్తారని అనుకుంటున్న తరుణంలో ఈ రెండు సీట్లకు కూడా ఆయన ఉభయ గోదావరి జిల్లాలనుంచి మాత్రమే పోటీచేస్తారని ఒక ప్రచారం ఉంది. అందులోనూ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీచేసినా కూడా మళ్లీ ఓడిపోతే.. ఎలాంటి సాకులు చెప్పుకోవాలో.. జనసేన నాయకులు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారు.
పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యేగా పోటీచేసే ఉద్దేశం ఉంటే.. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగవచ్చునని స్థానికగానూ, పార్టీలోనూ చాలా రోజులుగా ఊహాగానాలు ఉన్నాయి. కాపు వర్గం ఓటు బ్యాంకు స్థిరంగా, బలంగా ఉన్నందునే ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నారనే ప్రచారం ఉంది. అయితే పవన్ ను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేగ్జిమమ్ ఫోకస్ పెడుతుందనే సంగతి అందరూ ఊహించవచ్చు.
చంద్రబాబునాయుడు విషయంలో ఆయన కుప్పం నుంచి బరిలో ఉంటారనేది అందరికీ తెలుసు కాబట్టి.. ఇప్పటికే వైఎస్సార్ సీపీ అక్కడ తమ కాన్సంట్రేషన్ పెంచింది. వైనాట్ 175 నినాదంలో భాగంగా కుప్పంలో కూడా పార్టీ గెలిచి తీరాలని ప్లాన్ చేసుకుంటోంది. అక్కడ ఎమ్మెల్యేను గెలిపిస్తే.. మంత్రి పదవి కూడా ఇస్తానని వైఎస్ జగన్ స్థానికులకు హామీ ఇచ్చారు కూడా. కానీ పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీచేస్తారనేది బయటకు రాలేదు. ఆయన ఎక్కడ దిగినా సరే.. గ్యారంటీగా ఓడించాలనే కోరిక వైసీపీలో ఉంది. గత ఎన్నికల పరాభవాన్ని ఆయనకు మళ్లీ రుచిచూపించాలని అనుకుంటున్నారు.
అయితే.. పార్టీ ఇలాంటి కోరికను సాకుగా చూపిస్తూ.. పవన్ ను ఓడించడానికి జగన్ సర్కారు దొడ్డి దారి నియామకాలు, బదిలీలు చేపడుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల ఆర్వోగా , ఈఆర్వోగా నియమిస్తున్న అధికార్ల విషయంలో తప్పుడు ప్రచారాలకు పచ్చదళాలు దిగుతున్నాయి.
అక్కడి అధికారి సివి ప్రవీణ్ ఆదిత్యను, కాకినాడ రూరల్ జేసీగా నియమించడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదికారికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రక్రియకు సంధానకర్తలుగా ఉండగలరు తప్ప.. వారు స్వయంగా బీభత్సమైన మేనిప్యులేషన్ లు చేయలేరనే సంగతి విమర్శించే వారు మరచిపోతున్నారు.
చూడబోతే.. పిఠాపురంలో పోటీచేయాలనుకుంటున్న పవన్ ఓడిపోతే ఏం చేయాలో కూడా జనసైనికులు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నట్టుంది. అంటే.. ఆర్వోలో రూపంలో తమ పవన్ ను ఓడించారని రచ్చ చేయడానికి ఇప్పటినుంచే జనసైనికులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉంది. ఇలాంటి చవకబారు టెక్నిక్కులను జనసైనికులు పక్కన పెట్టాలని ప్రజలు హితవు చెతున్నారు.