జనసేన, బీజేపీలకు ఏయే సీట్లను పంచబోతున్నారు అనే సంగతే ఇంకా తేలలేదు. ఆ రెండు పార్టీలకు కలిపి 30 సీట్లు కేటాయిస్తున్న సంగతి తేలిపోగా ఇప్పటికి ప్రకటితమైనది కేవలం అయిదు నియోజకవర్గాలే. ఆ అయిదు సీట్లకు సంబంధించి కూడా తెలుగుదేశం వర్గాల్లో రేగుతున్న అసంతృప్తిని చక్కబెట్టడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ ఇబ్బందులు పడుతూ ఉండగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీలోని అసంతృప్తి పెద్దస్థాయిలో వ్యక్తం కావడం పార్టీకి ప్రమాదకరంగా మారుతోంది.
కాకినాడరూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం నాయకుడు పెంకే శ్రీనివాస్ బాబా అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈ నియోజకవర్గం జనసేనకు వెళ్లింది. ఆ పార్టీ తరఫున తొలి జాబితాలోనే పంతం నానాజీని అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. దాంతో కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీలో ముసలం రాజుకుంది. ఆ ముసలం ఇప్పుడు పార్టీ పతనాన్ని నిర్దేశించేలా కనిపిస్తోంది.
అభ్యర్థిత్వం హామీ ఉండడం వల్ల పార్టీ కోసం ఇన్నాళ్లూ చాలా కష్టపడి పనిచేశానని పెంకే శ్రీనివాస్ బాబా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తనను మోసం చేసిందని అంటున్నారు. నియోజకవర్గంలో ఇన్నాళ్లుగా పార్టీ కోసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా.. జనసేన నాయకులు కొన్నింటిలో కూడా తమతో కలిసి పాల్గొనలేదని అలాంటిది ఇప్పుడు వారికి టికెట్ కట్టబెట్టేయడం అన్యాయం అని ఆయన అంటున్నారు.
కాకినాడ రూరల్ నుంచి ఇండిపెండెంటుగా బరిలోకి దిగడానికి శ్రీనివాస్ బాబా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన చాటుమాటుగా కాదు.. బహిరంగంగా భారీఎత్తున నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి మరీ అంటున్నారు. అదే జరిగితే గనుక.. ఇక్కడ తాము విజయం సాధించగలం అనుకుంటున్న జనసేన ఆశలు అడియాసలవుతాయి. ఇంతకూ ఈ అసమ్మతుల్ని చంద్రబాబు బుజ్జగించగలరా లేదా అని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెనాలి కూడా జనసేనకు వెళ్లింది. అక్కడ నాదెండ్లను అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఆలపాటి రాజాను చంద్రబాబు బుజ్జగించగలిగారు. కానీ, కాకినాడ రూరల్ లో అలాంటి బుజ్జగింపులు ఆయనకు చేతనవుతాయా? లేదా? అనేది ప్రశ్నగా ఉంది. శ్రీనివాస్ బాబాకు సర్దిచెప్పి ఆయన ఎణ్నికల్లో జనసేనకు పూర్తిగా సహకరించేలా చేయకపోతే.. చంద్రబాబు తీరుపట్ల పవన్ కల్యాణ్ లో ఆగ్రహం పెల్లుబుకుతుందని, దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని జనసైనికులు అంటున్నారు.