జనసేన ఫైర్ బ్రాండ్ రాయపాటి అరుణపై భౌతిక దాడి జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెను చితక్కొట్టారు. కనీసం మహిళ అనే సంస్కారం లేకుండా లం..భాషలో తిట్టడం, రొమ్ములపై గుద్దడంతో గాయాలపాలైన రాయపాటి అరుణ ఆస్పత్రి పాలయ్యారు. రాయపాటి అరుణపై భౌతిక దాడి అనగానే వైసీపీ కార్యకర్తలేమైనా చేసి వుంటారేమో అని అంతా అనుకున్నారు.
ఎందుకంటే రాయపాటి అరుణ తెల్లారి లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులపై నోరు పారేసుకుంటుంటారు. రాయపాటి అరుణ తిట్లను జీర్ణించుకోలేక వైసీపీకి చెందిన వారెవరైనా దాడికి పాల్పడి వుంటారని భావించారు. అయితే అసలు విషయం తెలుసుకుని… అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. జనసేన వీర మహిళపై దాడికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే పాల్పడడం గమనార్హం.
ప్రకాశం జిల్లాకు చెందిన రాయపాటి అరుణ పార్టీ సిద్ధాంతాలపై పవన్ తర్వాత తానే అనేలా భారీ డైలాగ్‌లు కొడుతూ తక్కువ సమయంలోనే ఆ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగారు. నిత్యం టీవీ, యూట్యూబ్ డిబేట్లలో కనిపిస్తూ, జనసేనలో కీలక నాయకురాలనే గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అరుణపై దాడికి ప్రకాశం జిల్లాలో జనసేన అంతర్గత విభేదాలు కారణమని తెలిసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ మీడియాతో మాట్లాడుతూ తన రొమ్ములు, డొక్కల్లో చలపతి రాంబాబు అనే వ్యక్తి ఆధ్వర్యంలో దాడి చేసినట్టు చెప్పారు. జిల్లా రాజకీయం అంతా నీ వల్ల అధిష్టానానికి పోతోందని సదరు వ్యక్తి కొడుతూ అన్నట్టుగా అరుణ వెల్లడించడం గమనార్హం. లం..భాషలో తిట్టినట్టు అరుణ వాపోయారు. గాయాలపాలైన తనను స్థానికులు కారులో ఎక్కించినా, చలపతి రాంబాబు వదిలి పెట్టలేదన్నారు. తన కారు చుట్టూ వీరంగం సృష్టించాడని ఆమె అన్నారు. దిగవే అని తిట్టడాన్నారు.
తనపై దాడికి సంబంధించి జనసేన ముఖ్య నాయకులు హరిప్రసాద్, అజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్టు రాయపాటి అరుణ తెలిపారు. పవన్‌కల్యాణ్ దృష్టిలో పెడతామన్నారని తెలిపారు. అలాగే లీగల్‌గా చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలు తనకు సూచించారన్నారు. ఇదిలా వుండగా రాయపాటి అరుణపై జనసేన కనీసం ఖండన కూడా చేయకపోవడం గమనార్హం. జనసేన సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇదే అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడి వుంటే… టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నానాయాగీ చేసి వుండేవారనే చర్చకు తెరలేచింది.