భ‌యం కనిపించని జగన్

జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ బలంగా కనిపిస్తున్నా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొహంలోగానీ, మాటల్లోగానీ కించిత్‌ కూడా బెరుకు, బెదురు కనిపించడం లేదు. పైగా ఆయనలో మరింత ఆత్మవిశ్వాసం,…

జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ బలంగా కనిపిస్తున్నా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొహంలోగానీ, మాటల్లోగానీ కించిత్‌ కూడా బెరుకు, బెదురు కనిపించడం లేదు. పైగా ఆయనలో మరింత ఆత్మవిశ్వాసం, ధీమా కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తా సిద్ధం సభలో జగన్‌మోహన్ రెరెడ్డి ఉరిమే ఉత్సాహంతో కనిపించారు. ఆయన ప్రతి మాటలో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా గెలుపు తనదే అనే  భరోసా తొణికిసలాడింది. పార్టీ శ్రేణుల్లోనూ అటువంటి ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు.

ఎన్నికల యుద్ధంలో చాలా మంది సేనాధిపతులు కనిపిస్తున్నారు… సేనాధిపతులే తప్ప వాళ్లకు సైన్యమే లేదు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక గుండు సున్న.. సున్నాను ఏ సంఖ్యతో గుణించినా పెద్ద బోడిగుండే తప్ప ఏమీ వుండదు…అంటూ టీడీపీ పొత్తులను తేలిగ్గా తీసిపడేశారు.

మన ఫ్యాను గిరగిరా తిరగడానికి పక్క పార్టీల నుంచి కరెంటు రాదు.. జనం నుంచే ఆ పవర్ వస్తుంది.. సైకిల్ అలా కాదు.. దాన్ని ఎవరో ఒకరు వెనక నుంచి నెట్టాలి… అసలు సైకిల్ కి‌ చక్రాలే లేవు అంటూ తెలుగుదేశం పార్టీ పొత్తులను హేళన చేశారు. మన పార్టీ విరగకాసిన మామిడి చెట్టులా వుంటే టీడీపీ తెగులు పట్టి ఎండిపోయిన చెట్టులా వుందంటూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అచేతన స్థితిని ఎండగట్టడం ద్వారా తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు సైకిల్‌కి ఇప్పుడు స్టీరింగే లేదు.. అందుకే ఆయన సైకిల్‌ను నడిపించే వారికోసం ఢిల్లీలో పడిగాపులుగాచి పొత్తు కుదుర్చుకున్నారు అంటూ చంద్రబాబు సైకిల్‌కి గాలి తీశారు.

టీడీపీ పొత్తులపై జగన్ ఎలా స్పందిస్తారోనని వైసీపీ శ్రేణులు, రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ పొత్తులను దూదిపింజలా తీసిపడేస్తూ మేదరమెట్ల సిద్ధం సభలో జగన్ చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో తరగని ఉత్సాహాన్ని నింపింది.