మరోసారి బాలీవుడ్ లోకి మురుగదాస్

తమిళ దర్శకుడు మురుగదాస్ కు బాలీవుడ్ కొత్త కాదు. హిందీ గజనీ సినిమాను అమీర్ ఖాన్ తో, తుపాకీ సినిమాను అక్షయ్ కుమార్ తో రీమేక్ చేశాడు. అయితే ఆ తర్వాత గ్యాప్ ఇచ్చాడు.…

తమిళ దర్శకుడు మురుగదాస్ కు బాలీవుడ్ కొత్త కాదు. హిందీ గజనీ సినిమాను అమీర్ ఖాన్ తో, తుపాకీ సినిమాను అక్షయ్ కుమార్ తో రీమేక్ చేశాడు. అయితే ఆ తర్వాత గ్యాప్ ఇచ్చాడు. బాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు.

మళ్లీ ఇన్నేళ్లకు బాలీవుడ్ పై మురుగదాస్ కన్నుపడింది. ఈసారి సల్మాన్ ఖాన్ హీరోగా సినిమా లాక్ చేశాడు మురుగదాస్. ఈ ప్రాజెక్టుకు చాలా ప్రత్యేకతలున్నాయి.

సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది కిక్ సినిమా. తెలుగు కిక్ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని గతంలోనే ప్రకటించాడు దర్శక-నిర్మాత సాజిద్ నడియావాలా. చెప్పినట్టుగానే కిక్-2 తెరపైకి వచ్చింది. అయితే దర్శకుడు మాత్రం సాజిద్ కాదు, మురుగదాస్.

కిక్-2 ప్రాజెక్టును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని స్క్రీన్ ప్లే రాశాడు మురుగదాస్. ఇది సల్మాన్ కు నచ్చింది. వెంటనే ప్రాజెక్టు లాక్ అయింది. మే నెలలో ఓ చిన్న షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. జులై నుంచి ఏకథాటిగా షూటింగ్ చేస్తారు.

అంతా అనుకుంటున్నట్టు రవితేజ కిక్-2 ప్రాజెక్టుకు ఇది రీమేక్ కాదు. పేరుకు ఇది కిక్-2 అయినప్పటికీ, పూర్తిగా కొత్త కథ. కాకపోతే కిక్ లో ఉన్న హీరో పాత్ర కిక్-2లో కూడా కొనసాగుతుంది.