కాపులకు అధికారం అందని ద్రాక్షే!

రాష్ట్రంలో రాజకీయ అధికారం ఎప్పటికీ ఆ రెండు కులాల చేతుల్లో మాత్రమే ఉండాలా? సంఖ్యాపరంగా వారికంటె బలమైన కాపు కులానికి అధికారం దక్కదా? కాపు నాయకుడు ముఖ్యమంత్రి ఎందుకు కారు? మేం కేవలం మిమ్మల్ని…

రాష్ట్రంలో రాజకీయ అధికారం ఎప్పటికీ ఆ రెండు కులాల చేతుల్లో మాత్రమే ఉండాలా? సంఖ్యాపరంగా వారికంటె బలమైన కాపు కులానికి అధికారం దక్కదా? కాపు నాయకుడు ముఖ్యమంత్రి ఎందుకు కారు? మేం కేవలం మిమ్మల్ని గెలిపించడానికి మాత్రమే లేం, అధికారాన్ని పంచుకోవడానికి కూడా ఉన్నాం… ఇలాంటి నినాదాలు కాపు వర్గాల నుంచి, కాపు నాయకుల నుంచి అనేకమార్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే, సింహాసనాన్ని అధిష్ఠించడానికి కాంక్ష ఒక్కటీ ఉంటే సరిపోతుందా? దానికి ఒక వ్యూహం, దానిని అనుసరించడంలో ఒక క్రమపద్ధతి అవసరం లేదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు నిజంగానే సంఖ్యాపరంగా ఒక పెద్దకులంగా ఉన్నప్పటికీ,, ఆ కులంలో కూడా బోలెడుమంది సంపన్నులు ప్రభావశీలమైన వ్యక్తులు ఉన్నప్పటికీ.. అధికారం చేజిక్కించుకోవడం వారికి చేతకావడం లేదు. కర్ణుడి చావుకు కారణాలు ఆరే అయినా.. ఇందుకు కారణాలు మాత్రం అనేకం! ఆ ధోరణుల మీదనే ఈ వారం కవర్ స్టోరీ ‘కాపులకు రాజ్యాధికారం అందని ద్రాక్షే!

రాజకీయ అధికారం కులాల దామాషాలో దక్కుతూ ఉండాలా? లేదా.. అధికారంలోకి వచ్చిన వారు తమ తమ కులాలను మరచిపోయి ప్రజలందరి సమాన వికాసం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉండాలా? ఇలాంటి చర్చను సంధించినప్పుడు.. నూటికి నూరుశాతం ప్రతి ఒక్కరూ కూడా రెండవ ఆప్షన్ కు జై కొడతారు. అధికారంలోకి వచ్చిన వాళ్లు.. తమ తమ కులాలనలు మరచిపోయి సమాజ సంక్షేమానికి పనిచేయాలని అంటారు. కానీ ప్రతి విషయం కూడా ఇందుకు విరుద్ధంగానే జరుగుతూ ఉంటుంది.

రెండవ ఆప్షన్ ను ఎంచుకున్న వారందరూ కూడా.. సందరర్భం వచ్చినప్పుడు తమ తమ కులాలకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఆవేదన చెందుతుంటారు. లేదా, అధికారంలో తమ వాళ్లే ఉన్నప్పటికీ కూడా తమకేమీ దోచిపెట్టడం లేదని, తమను ప్రత్యేకంగా చూడడం లేదని కుమిలిపోతుంటారు. తమాషా ఏమిటంటే.. అధికారంలోకి వచ్చిన వ్యక్తి తమ తమ కులాలు మరచిపోయి అందరినీ సమానంగా చూడాలి.. అని అందరూ నీతులు చెప్తారు. కానీ, అధికారంలోకి వచ్చిన వ్యక్తిని కులరహితంగా చూడలేరు!!

పవన్ చేసిన వంచనతో కాపునేతలు దూరం!

పవన్ కల్యాణ్ ను ఇవాళ చంద్రబాబునాయుడు దగ్గరకు చేరదీశాడంటే దాని అర్థం కేవలం ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం వల్ల మాత్రమే. నేను విశ్వమానవుడిని, నాకు కులమూ మతమూ ఏవీ అంటవు.. అని పవన్ కల్యాణ్ పంచ్ డైలాగులు చెబుతూ ఉండవచ్చు గాక. కానీ కేవలం కాపు కావడం వల్ల మాత్రమే ఆయనకు ప్రాధాన్యం దక్కుతోందని ఆయనకు కూడా తెలుసు.

మెజారిటీ ఉండే  కాపు కులం ఓట్లను వీలైనంతగా చంద్రబాబుకు అనుకూలంగా వేయించడం కూడా ఆయన లక్ష్యం. అయితే ఇందులో పవన్ కల్యాణ్ చాలా నర్మగర్భంగా, గుంభనంగా వ్యవహరిస్తుంటారు. ఆయన నేరుగా కాపులందరూ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేయాలని పిలుపు ఇవ్వరు. తన తటస్థ, కులరహిత ఇమేజి దెబ్బతినకూడదని కోరుకుంటారు. కేవలం తాను చంద్రబాబు పక్కన నిల్చున్నాడు గనుక.. కాపులంతా ఆయనకు వంగి సలాములు చేయాలనేది పవన్ కోరిక.

సరిగ్గా ఇక్కడ చిన్నచిన్న మడత పేచీలు ఏర్పడ్డాయి. నిన్నటి ముద్రగడ, ఇవాళ్టి చేగొండి హరిరామజోగయ్య పరిణామాలు అంత అనూహ్యంగా తెరమీదకు వచ్చినవి కానే కాదు. ఈ ఇద్దరినీ కూడా పవన్ కల్యాణ్ తన అవకాశ వాదానికి పావుల్లాగా, తన ఎదుగుదలకు నిచ్చెన మెట్లలాగా వాడుకున్నారు.

ముద్రగడ పద్మనాభం తొలినుంచి కూడా చంద్రబాబునాయుడు మోసపూరితమైన ధోరణులను వ్యతిరేకిస్తూ వస్తున్న నాయకుడు. కాపులను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించి.. ఆ తర్వాత వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వంచించిన చంద్రబాబు మీద ముద్రగడ పద్మనాభం ఎన్నిసార్లు ధ్వజమెత్తారో, ఎన్ని ప్రత్యక్ష పోరాటాలకు పూనుకున్నారో, చంద్రబాబు వైపు నుంచి ఎన్ని రకాల వేధింపులు అనుభవించారో, ఎన్నెన్ని గృహ నిర్బంధాలను ఎదుర్కొన్నారో.. ప్రతి సంగతీ ప్రజలకు తెలుసు. అలాంటి ముద్రగడ పద్మనాభం మెత్తబడేలా చేసి.. ఆ తర్వాత ఆయనను గాలికొదిలేశారు పవన్ కల్యాణ్. ముద్రగడ వద్దకు తన అనుచరుల్ని మంతనాలకు పంపారు. తద్వారా ముద్రగడ పద్మానభం జనసేనలో చేరబోతున్నారని మీడియాలో లీకులు ఇప్పించారు.

రెండు మూడు రోజుల్లోగా పవన్ కల్యాణ్ నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్లి కలుస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఆయనకు ఒక ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తారని అన్నారు. అయితే పాలపొంగులాగా ఈ ప్రచారం మొత్తం చప్పున చల్లారిపోయింది. ముద్రగడకు కాదు  కదా.. అసలు కాపు కమ్యూనిటీకోసమే ఒక్క మాట కూడా చెప్పకపోగా.. ముద్రగడ రాజీపడినట్టు మాత్రం ప్రచారం జరిగింది. ఇంతలోనే ముద్రగడను పవన్ పట్టించుకోవడం మానేశారు. విశాఖ వెళ్లి సీనియర్ నాయకుడు కొణతల రామకృష్ణతో ఇంటికి వెళ్లి మరీ భేటీ అయిన పవన్ కల్యాణ్ ముద్రగడను మాత్రం పట్టించుకోలేదు. రాజమండ్రి వచ్చి కూడా అక్కడకు అతిసమీపంలో ఉండే ముద్రగడ నివాసానికి వెళ్లే ఉత్సాహం చూపించేదు. దీంతో ముద్రగడ అభిమానులు ఆగ్రహించారు. ఆయన తిరిగి ఎప్పటి లాగా చంద్రబాబు మీద వాస్తవాలు మాట్లాడడం ప్రారంభించారు.

హరిరామజోగయ్య సంగతి భిన్నమేమీ కాదు. ఏ మాత్రం రాజకీయ అవగాహన లేని పవన్ కల్యాణ్  పార్టీ పెట్టాలని అనుకున్న నాటినుంచి కూడా.. చేగొండి హరిరామజోగయ్య ఆయనకు ఎంతగా అండగా ఉన్నారో, ఆ పార్టీ వెన్నుదన్నుగా నిలిచారో ప్రతి ఒక్కరికీ తెలుసు. పార్టీ నిర్మాణం నుంచి, విధాన రూపకల్పన వరకు ప్రతి విషయంలోనూ ఆయన మార్గదర్శిగా నిలిచారో. పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు తన రాజకీయ అవగాహనను మెరుగుపరచుకోవడంలో చేగొండి పాత్ర ఎంతో ఉంది. అయితే ఆయనను కూడా పవన్ కల్యాణ్ పక్కన పెట్టడం జీర్ణించుకోలేకపోయారు.

కాపులకు రాజ్యాధికారం రావాలని.. కాపుకులం రాజకీయంగా ఐక్యంగా ఉండాలని, అధికారాన్ని దక్కించుకోవడం కేవలం పవన్ కల్యాణ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తుల్లో హరిరామజోగయ్య ఒకరు. అయితే.. పవన్ కల్యాణ్ తన సొంత ప్రయోజనాల కోసం తాను ఏదో ఒక రూపంలో ప్రభుత్వంలో ఉండగలిగితే చాలు అనే కాంక్షతో చంద్రబాబుకు అడుగులకు మడుగులొత్తుతూ ఉండడంతో ఆయన విసిగిపోయారు. ఇంతదూరం వచ్చిన తర్వాత ఆయన సలహాలను పవన్ తీసిపారేయడంతో ఆయన అలిగి పార్టీకి దూరం అయ్యారు. టికెట్ ఆశించిన ఆయన కుమారుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకున్నారు.

కాపు కులం కోసం పనిచేయడమే తమ జీవితాశయంగా పెట్టుకున్న ఇద్దరు కీలక నాయకుల్ని ఈ రీతిగా మోసం చేయడం మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని కాపు జాతిని యావత్తుగా కూడా మోసం చేశారు. కాపుల్ని బీసీల్లో చేర్చడం గురించి హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడు మొర్రో అని జాతి యావత్తూ గగ్గోలు పెడుతూ ఉండగా.. ముద్రగడ పద్మనాభం దీక్షలు చేస్తుండగా.. పవన్ కల్యాణ్ ‘ఒకవేళ ఆయన అలా హామీ ఇచ్చి ఉంటే దానిని నెరవేర్చాల్సిందే’ అని నంగిమాటలు మాట్లాడారు తప్ప.. కాపు వర్గం తరఫున ఆయనను డిమాండ్ చేయలేదు. ఆయన వద్ద కనీసం ప్రస్తావించలేదు. ఒకవేళ ఆ హామీ నెరవేర్చకుండా  ఎగ్గొట్టవచ్చు గాక.. దానికి సంబంధించి చంద్రబాబు వివరణ కూడా తీసుకుని తన కాపు కులానికి తెలియజేయలేదు. కాపుకులంతో పవన్ కల్యాణ్ దొంగాట ఆడారు.

మొన్నటికి మొన్న బీసీ సభలో బీసీలు అందరినీ ఉద్ధరించేస్తానని, వారికి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పిస్తానని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా దామాషా ప్రకారం రిజర్వు చేసి కట్టబెడతామని అనేక రకాల హామీలను బీసీలకు చంద్రబాబు కురిపిస్తూ ఉంటే.. పవన్ కల్యాణ్ పక్కన నిల్చుని జై కొడుతూ ఉన్నారే తప్ప.. కాపు కులాన్ని బీసీ చేస్తానన్న హామీ ఏమైందనే ప్రస్తావన , సభాముఖంగా అక్కర్లేదు కనీసం ప్రెవేటుగానైనా, చేసినట్టు కూడా కనిపించలేదు. ఒకవైపు రాష్ట్రంలోని కాపుయువత, దాదాపుగా కాపులందరూ పవన్ కల్యాణ్ ‘తమ వాడు’ అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన తన అవకాశవాదాన్ని, వంచన పర్వాన్ని ఇలా నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉంటాడు. ఇక ఆ కులం ఎప్పటికి బాగుపడుతుంది? వారు రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం అనేది సాధ్యమవుతుందా? అనేవి ఆ కులంలో ఆలోచన పరుల్ని వేధిస్తున్న సందేహాలు. 

చంద్రబాబును ఎందుకు నమ్మాలి?

కాపు వర్గం చంద్రబాబునాయుడును ఎందుకు నమ్మాలి? ఎందుకు ఆయనకు మద్దతుగా నిలవాలి? ఈ ప్రశ్నలకు తెలుగుదేశం నాయకుల వద్ద గానీ.. కనీసం పవన్ కల్యాణ్ ఆయన వందిమాగధుల వద్దగానీ సరైన సమాధానం ఉందా? పవన్ కల్యాణ్ ఇప్పుడు తనతో పొత్తు బంధంలోకి తీసుకున్నాడు గనుక.. రేపు నిజంగానే ఆ కూటమి గెలిస్తే పవన్ కు ఒక మంత్రి పదవి కూడా ఇస్తారు గనుక.. ఇక రాష్ట్రంలోని కాపులకు తాము చేయాల్సింది ఏమీ లేదు అని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి, మాట తప్పిన వైనం గురించి ఆయన మాటమాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. ‘కాపు ఓట్లు ఎక్కడకు పోతాయిలే’ అని టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. కనీసం సారీ కూడా చెప్పలేదు. బీసీలుగా మార్చడం అనేది సాధ్యం కాదని ఆయన ఇప్పుడు భావిస్తుంటే గనుక.. ఆ వర్గం అభ్యున్నతి కోసం కొత్తగా ఏం చేయదలచుకున్నారో కొన్ని ఆలోచనలనైనా పంచుకుని ఉండడం అవసరం. కానీ చంద్రబాబు తరఫు నుంచి అలాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదు.

కాపు వర్గం కోసం ఆయనవైపు నుంచి ఎలాంటి హామీ కూడా రాకముందే.. పవన్ కల్యాణ్ తనంత తానుగా వెళ్లి ఆయనకు జైకొట్టేసి, ఆయన పంచలో నిలబడి దేహీమని సీట్లు పుచ్చుకుని సంబరపడుతోంటే.. చంద్రబాబు ఇక ఆ కులాన్ని ఎందుకు పట్టించుకుంటారు? కాపు వర్గానికి ఏం చేయబోతున్నారో నిర్దిష్టంగా చెప్పిన తర్వాత గానీ.. తాను పొత్తులకు అంగీకరించబోనని పవన్ కల్యాణ్ ముందే కండిషన్ పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా.. ఇప్పుడు చంద్రబాబును కాపు వర్గం మొత్తం ఎందుకు నమ్మాలి? అనేది వారిలో కలుగుతున్న సందేహం. 

జగన్ ను ఎందుకు ద్వేషించాలి?

అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించడానికి కూడా కాపు వర్గానికి పెద్దగా కారణాలు కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ తిట్టినంత మాత్రాన..కులం మొత్తం జగన్ ను ద్వేషిస్తూ బతకాలా? ఆయనేమీ ఆడిన మాట తప్పలేదు కదా? బీసీలుగా మారుస్తా వంటి మాటలతో మోసం చేయలేదు కదా? కాపు వర్గం సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు తేగలనని ప్రకటించారో అవన్నీ చేస్తున్నారు.

కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, యువతను విదేశాలకు పంపడం వంటి కార్యక్రమాలతో ఆయన కాపు వర్గం మనసు చూరగొంటున్నారు. అందుకే జగన్ ను ద్వేషించడానికి కూడా వారికి పెద్దగా పాయింట్ కనిపించడం లేదు. 

వారికి జరుగుతున్న మోసం ‘మెగా’కాలం నాటిది!

ఈ రాష్ట్రంలో కాపు వర్గం ఎంత వంచనకు,మోసానికి గురవుతున్నారో అందరికీ తెలుసు. కానీ వారిని మోసం చేస్తున్నది.. ఆ వర్గంలోని ప్రముఖులే కావడం గమనించాల్సిన సంగతి. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలోని కాపులందరూ కూడా దానిని తమ పార్టీ అనుకున్నారు. ఆయన వెంట నిలిచేందుకు ప్రయత్నించారు. తొలిఅడుగులో మెగాస్టార్ కు ప్రోత్సాహకరమైన ఫలితమే లభించింది. అయితే కాపు వర్గం అందించిన ప్రోత్సాహాన్ని, వారి నమ్మకాన్ని, వారు పెట్టుకున్న ఆశలను ఆయన నిలబెట్టుకోలేకపోయారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేశారు. ఆ సందర్భంగా.. తన వెంట ఉండి గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కూడా భారీ ప్యాకేజీగా భారీ ఆర్థిక ప్రయోజనాలను చేకూరేలా చేశారనే ప్రచారం ఉంది. వారిని బాగు చేయడం తప్ప.. కాపు కులాన్ని బాగు చేయడం, కాపు వర్గం మేలు గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు.

ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు కాకపోతే తర్వాతి సారి.. తప్పకుండా అవుతాడని కాపులు నమ్మిన మెగాస్టార్ ఆ రకంగా పార్టీని ముంచేశారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆవేశపూరితమైన మాటలు విని.. ఏదో ఒకనాటికి లేదా, ఈ దఫా కూటమి అధికారంలోకి వస్తే కనీసం సగం టర్మ్ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆ వర్గం కలలు కంటూ ఉంటే.. పవన్ కల్యాణ్ ఇంకో రకంగా వారి కలల్ని ఛిద్రం చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడం సంగతి ఏమో గానీ.. అసలు ఆ వర్గం, ఆ కులం ఎంతో కొంత కోరుకునే మేలు పొందడానికి ఆయన ఇసుమంతైనా సహకరించే విధంగా లేరు. ఇక కాపు కులానికి రాజ్యాధికారం ఎలా దక్కుతుంది. 

చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి ప్రభావశీలమైన వ్యక్తులు కూడా తేడాగా వ్యవహరిస్తుండగా.. కాపుకులం మొత్తం ఐక్యంగా ఒకరి వెంట నడవడం అనేది ఎప్పటికీ జరిగేలా లేదు. ఇప్పటికే జనసే కాపు పార్టీగా ముద్ర ఉన్నప్పటికీ.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశంలలో కూడా కాపు నాయకులు గణనీయంగానే ఉన్నారు. వారి కులం మాత్రమే కలసి కట్టుగా ముందుకు సాగి.. ఐక్యంగా అధికారంలోకి రావడానికి వారు పరస్పరం సహకరించుకుంటారనేది మిధ్య. ఒకరు నిచ్చెన ఎక్కుతోంటే.. కిందినుంచి కాళ్లు లాగడానికి పదిమంది తయారవుతూ ఉండే తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. కాపుల కోసమే, కాపులతో ప్రారంభించిన పార్టీలు కూడా మన రాష్ట్రంలో అందుకే మఖలో పుట్టి పుబ్బలో మంటగలిసిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ కులానికి రాజకీయ అధికారం, ముఖ్యమంత్రి పదవి అనేది ఎప్పటికీ అందని ద్రాక్షే కదా అనే అభిప్రాయమే పలువురిలో వినిపిస్తోంది. 

ప్రారంభంలో చెప్పుకున్నట్టు మనం ఒక్క విషయాన్ని అంగీకరించాలి. అధికారం ఒక్కరి చేతికి మాత్రమే అందుతుంది. ఆ వ్యక్తి ఏదో ఒక కులానికి చెందిన వారు మాత్రమే అయి ఉంటారు. అంతమాత్రాన.. అధికారంలో ఉన్న వ్యక్తి కులం మాత్రమే బాగుపడుతుందని అనుకోవడం పిచ్చితనం. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేసే ఆలోచన అది. ఆ ఆలోచన లోంచిచ పుట్టిన మాటలే.. ప్రతి కులానికి అధికారం కావాలి కదా.. అనేవి. ఏ వ్యక్తి అధికారంలోకి వచ్చినా సరే.. అన్ని కులాల అభ్యున్నతి కోసం సమానంగా పనిచేయాలని కోరుకున్నప్పుడే ఈ సమాజం సరైన గతిలో ముందుకు సాగుతుంది. కుల రహిత సమాజం ఏర్పడుతుందని మనం ఆశించలేం గానీ.. ఏ కులంలోనైనా పేదలు నిత్యం కుమిలిపోతూ ఉండే, సంపన్నులు నిత్యం దోచుకుంటూనే ఉండే దుర్మార్గపు పోకడలకు చరమగీతం పాడాలని కోరుకోవాలి.

..ఎల్. విజయలక్ష్మి

 Read Great Andhra Epaper