నాగబాబు పోయి సీఎం రమేష్ వచ్చె!

ఇప్పటిదాకా విశాఖనే వలస నేతల అడ్డా అని అంతా అనుకున్నారు. 2024 ఎన్నికల్లో చూస్తే అనకాపల్లిని కూడా వలస పక్షుల సురక్షిత కేంద్రంగా భావిస్తున్నారు. ఇది రాజకీయ చిత్రంగానే అంతా చూస్తున్నారు. పక్కా లోకల్స్…

ఇప్పటిదాకా విశాఖనే వలస నేతల అడ్డా అని అంతా అనుకున్నారు. 2024 ఎన్నికల్లో చూస్తే అనకాపల్లిని కూడా వలస పక్షుల సురక్షిత కేంద్రంగా భావిస్తున్నారు. ఇది రాజకీయ చిత్రంగానే అంతా చూస్తున్నారు. పక్కా లోకల్స్ నే అనకాపల్లి ఇప్పటిదాకా ఎంపీలుగా ఎన్నుకుంటూ వచ్చింది.

కానీ మొదటిసారి అనకాపల్లి నుంచి గెలిచి పోదామని ఇతర జిల్లాల నుంచి దిగుమతి సరుకు వచ్చి పడుతోంది. అసలు అనకాపల్లిలో ఎక్కడ ఏముంటుందో తెలియదు, సమస్యలు అంతకంటే తెలియదు. భౌగోళిక నైసర్గిక పరిస్థితులు అంతకంటే అర్ధం కావు.

కానీ ఎంపీగా అక్కడ జనాలు నెగ్గించేస్తే అయిదేళ్ల పాటు పార్లమెంట్ లో కూర్చునే దర్జా వస్తుందన్న ఆశతో చలో అనకాపల్లి అని అంటున్నారు. ఈ మధ్య దాకా మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం సాగింది. ఆయన వచ్చి వారం రోజుల పాటు హడావుడి చేసి వెళ్లారు.

ఇపుడు ఆయన పోటీ చేయడంలేదు అని తేలిపోయింది. దాని వెనక కారణాలు తరచి చూస్తే అనకాపల్లి సీటుని బీజేపీకి రిజర్వ్ చేశారు అని లేట్ గా తెలిసింది. బీజేపీకి అనకాపల్లి సీటు ఇస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి పోటీ చేయాలని బీజేపీ లో ఆశావహులు ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం రమేష్ అనే కడప జిల్లా వాసి తెగ పట్టుదలగా ఈ విషయంలో ఉన్నారు అని అంటున్నారు. ఆయన కడప గడప దాటి అనకాపల్లికి రావాలని అనుకుంటున్నారు. బీజేపీకి అనకాపల్లి తరఫున ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు.

పోనీ ఆయన ఉన్న జిల్లాలలో బీజేపీకి పొత్తులలో టికెట్లు ఇవ్వడంలేదా అంటే రాజంపేట, హిందూపూర్ టికెట్లు ఇస్తున్నారు. అయితే ఈ రెండు చోట్ల క్యాడిడేట్లు డిసైడ్ అయిపోయారు. ఒకరేమో మాజీ సీఎం, మరొకరేమో కేంద్ర బీజేపీ నాయకత్వానికి కావాల్సిన మనిషి అని అంటున్నారు.

దాంతో సీఎం రమేష్ అన్నేసి జిల్లాలను దాటుకుని అనకాపల్లికి తరలి వస్తున్నారు. అనకాపల్లిలో తాను గెలుస్తాను అని ఆయన ధీమా పడుతూ టికెట్ కోసం ఒక స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు. అన్నీ ఫలించి రమేష్ కి టికెట్ వస్తే ఆయన గెలిచి వస్తే కనుక విశాఖ లాగానే అనకాపల్లి కూడా ఎంపీ సీటు ఫర్ కేరాఫ్ నాన్ లోకల్స్ గా మారుతుంది అని స్థానిక జనం భయపడుతున్నారు.