టికెట్లు దక్కలేదని పార్టీ మీద అసంతృప్తితో వేగిపోతున్న నాయకులకు రకరకాల తాయిలాలు ఆశ చూపించి ప్రలోభపెట్టి బుజ్జగించే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉంటున్నారు. బిజెపి కూడా తన పల్లకీ మోయడానికి సిద్ధమై పొత్తుల్లోకి రావడం అనేది ఆయనకు ఒక ఎడ్వాంటేజీగా మారింది. అసంతృప్త పార్టీ నాయకులకు ఎర వేయడం ఆయనకు ఈజీ అయిపోతోంది. అలాంటి ఎత్తుగడలతోనే ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేను బుజ్జగించేశారు. ఇంరా అనేక మంది నాయకులకు అలాంటి ప్రలోభాలు పెడుతున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన బొల్లినేని వెంకటరామారావు.. పార్టీలో సీనియర్ నేత! 2012లో ఉదయగిరి ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక వచ్చినప్పుడు తెలుగుదేశం తరఫున రంగంలోకి దిగిన ఆయన మేకపాటి చంద్రశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయారు. అదే 2014 ఎన్నికలు వచ్చేసరికి అదే ప్రత్యర్థి మీద కేవలం 3,622 ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనకు అప్పట్లో 85,873 ఓట్లు వచ్చాయి. 2019లో జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. ఆయన ఓట్లు 70వేలు కూడా దాటలేదు. అదే మేకపాటి చంద్రశేఖర రెడ్డి 1.06 లక్షల ఓట్లతో గెలిచారు.
ఆ తర్వాత నియోజకవర్గంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రజాదరణ లేకుండాపోయిందని ముద్రపడిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అధికార పార్టీనుంచి ఫిరాయించి తెలుగుదేశంలో చేరారు. అయితే ఆయనకు చంద్రబాబు మాత్రం టికెట్ గ్యారంటీ ఇవ్వలేదు. ఆయన ఫిరాయింపునకు ఏం ఆఫర్ చేశారో బయటకు రాలేదు గానీ.. టికెట్ కేటాయించలేదు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావును కూడా పక్కన పెట్టి, కొత్తగా కాకర్ల సురేష్ అనే అభ్యర్థిని రంగంలోకి తెచ్చారు.
దీంతో బొల్లినేని వర్గంలో అసంతృప్తి మొదలైంది. నిజానికి ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయాలని కూడా అనుకున్నారు. అయితే.. చంద్రబాబుతో భేటీ అవుతానని, ఆ తర్వాతే తన భవిష్యత్ రాజకీయం గురించి ప్రకటిస్తానని బొల్లినేని అన్నారు. చంద్రబాబును ఆయన కలిసేలోగా బిజెపితో పొత్తులు కూడా కలిశాయి. దీంతో ఢిల్లీ వ్యవహారాలను ఎరగా వేస్తూ.. చంద్రబాబు, బొల్లినేని పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఢిల్లీలో తెలుగుదేశం వ్యవహారాలను పూర్తిస్థాయిలో చూసుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తోంది.
కేంద్రంలో మోడీ సర్కారు మళ్లీ రాబోతున్నదని, తెదేపా కూడా ఎన్డీయేలో భాగస్వామి గనుక… ఢిల్లీలో ఉండి పార్టీ వ్యవహారాలు చూడడం, కేంద్రంతో మెలగడంలో బోలెడు ప్రయోజనాలుంటాయని, సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చునని ప్రలోభపెట్టి బొల్లినేని ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా ఢిల్లీ బిస్కట్ కు ఒప్పుకుని, పార్టీలో టికెట్ దక్కకుండా జరిగిన ద్రోహంపై రాజీ పడ్డారని అంతా అనుకుంటున్నారు.