పవన్ కల్యాణ్ ద్వారా అవమానాలు ఎదుర్కోవడం అనేది ఏపీలోని బిజెపి నాయకులకు చిన్నతనం అనిపిస్తున్నట్టుగా లేదు. పవన్ అహంకారం కొద్దీ వ్యవహరించే తీరుకు, ఆయన చేసే అవమానాలకు ఏపీ కమల నేతలు అలవాటు పడిపోయినట్టుగా ఉంది. తాజాగా మూడు పార్టీల పొత్తు కుదిరిన తర్వాత కూడా పవన్ వ్యవహార సరళి.. బిజెపిని, ఆపార్టీకి చెందిన స్థానిక నాయకుల్ని అవమానిస్తున్నట్టుగానే ఉన్నదని అందరూ భావిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నేతల్లో జడత్వం వచ్చేసినట్టే కనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నాటినుంచి.. తన రాజకీయ భవిష్యత్తు కోసం వ్యక్తిగతంగా కూడా మనుగడ కాపాడుకోవడం కోసం కేంద్రంలోని బిజెపి పంచన చేరారు పవన్ కల్యాణ్. ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఆయన స్వార్థ ప్రయోజనాలకోసం కేంద్రప్రభుత్వాన్ని తనకు ఒక కవచంగా వాడుకోవడానికి ఆ కూటమిలో చేరారే తప్ప.. తాము బిజెపితో పొత్తుల్లో ఉన్న పార్టీలాగా ఏనాడూ వ్యవహరించలేదు.
రాష్ట్రంలోని బిజెపి నాయకులతో ఏనాడూ సఖ్యంగా మెలగలేదు. వారితో కలిసి ఏనాడూ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఏపీ రాష్ట్ర బిజెపి నాయకులను పవన్ కల్యాణ్ అసలు మనుషులుగానే గుర్తించలేదు.
ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా సరే.. తనకు మోడీ, అమిత్ షా చాలా దగ్గరి మిత్రులు అంటూ ఆడంబరంగా ప్రగల్భాలు పలకడం తప్ప.. రాష్ట్ర పార్టీతో తాను కలిసి మెలిసి నడవాలనే కనీస గౌరవాన్ని ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు పొత్తులు కూడా అలాగే కుదిరాయి. పొత్తులకు సంబంధించి రాష్ట్రనేతలు ఏ ఒక్కరితోనూ ప్రకటనకు ముందు మంతనాలు సాగించలేదు, మాట్లాడలేదు. అంతా డైరక్ట్ ఢిల్లీ నుంచే అన్నట్టుగా వ్యవహారం నడిపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పొత్తు ప్రకటన తర్వాత కూడా రాష్ట్ర నాయకులకు విలువ ఇవ్వడం జరగడం లేదు.
పొత్తుల్లో చంద్రబాబునాయుడు చాలా తెలివిగా బిజెపి- జనసేనలకు కలిపి 30 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు ఇస్తున్నట్టుగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఆ నెంబర్ దాటేది లేదని తెగేసి చెప్పేశారు. ఆ సీట్లను వారిలో వారే పంచుకోవాలని, వారిలో వారే కొట్టుకోవాలని ఆయన డిసైడ్ చేశారు. అది ఆయన తెలివితేటలు కాగా, ఆ సీట్ల గురించి చర్చించడానికి కూడా పవన్ కల్యాణ్ ఏపీ స్థానిక బిజెపి నాయకులను కలవలేదు.
అదే వ్యవహారాన్ని నడిపించడానికి ఢిల్లీనుంచి వచ్చిన బైరాన్ సింగ్ షెకావత్ ను కలిసి మంతనాలు చేయడానికి మాత్రం వెళ్లిన పవన్, అసలు రాష్ట్ర నాయకులకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదని బిజెపి లీడర్లు మండిపడుతున్నారు. ఇలాంటి అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తే.. మనస్ఫూర్తిగా కూటమి పార్టీలకు అనుకూలంగా పనిచేయడం ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.