బాపట్ల జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారిపై నిర్వహించిన వైసీపీ సిద్ధం భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి ముందుగా ప్రకటించారు. అయితే సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటిస్తే, లక్ష్యం నెరవేరదనే ఉద్దేశంతో వాయిదా వేసుకున్నారు.
సిద్ధం సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. చేయగలిగిందే చెబుతామని స్పష్టం చేశారు. చంద్రబాబులా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే మేనిఫెస్టో ఇప్పుడు కాదు, మరొకసారి అని చెప్పినప్పటికీ, దాన్ని అనధికారికంగా ప్రకటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ప్రసంగంలోని ఈ మాటలే ఇందుకు నిదర్శనం.
“మళ్లీ జగనన్ననే తెచ్చకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబు అనే మాయలోడి వలలో పడొద్దని చెప్పండి. మళ్లీ మన అన్నను గెలిపించేందుకు చేయిచేయి కలిపి… మనమంతా ఒక్కటవుదాం అని చెప్పండి. ఇంటింటికీ పింఛన్, ఇళ్ల నిర్మాణం, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన కొనసాగాలంటే అన్న వస్తేనే జరుగుతుందని చెప్పండి. నవరత్నాల్లోని అన్ని పథకాలు కొనసాగుతాయని చెప్పండి”
వైసీపీ మేనిఫెస్టోపై సిద్ధం సభలో జగన్ తేల్చి చెప్పినట్టైంది. అయితే ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక లబ్ధి కంటే మరింత పెంచుతూ వైసీపీ మేనిఫెస్టో విడుదల అవుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. పింఛన్‌ను విడతల వారీగా రూ.4 వేలు లేదా మరో ఐదు వందల రూపాయలు పెంచొచ్చు. అలాగే రైతు భరోసా, ఇతర పథకాల లబ్ధిని పెంచి జనాన్ని ఆకట్టుకునేందుకు జగన్ ప్రయత్నించనున్నారు.
కరోనా లాంటి విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాల లబ్ధిని అందించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. అందుకే జగన్ చెబితే చేస్తారనే నమ్మకాన్ని చూరగొన్నారు. మరోవైపు చంద్రబాబునాయుడు అలివికాని హామీలతో కూటమిని మేనిఫెస్టోను తయారు చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ ఆయన కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇందులో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం కూడా వుండడం విశేషం. అయితే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే, అంత మందికి ప్రయోజనం కలిగిస్తామని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు.
గతంలో ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు. అదే చంద్రబాబుకు ఇప్పుడు నెగెటివ్ అవుతోంది. ఆయన ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు.