చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ తెలివి తేటలకు సిద్ధం సభ వేదికైంది. బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైన తర్వాత వైసీపీ మొదటి బహిరంగ సభ నిర్వహించింది. మూడు పార్టీలు కలిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియాక్షన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. బీజేపీపై విమర్శలు చేస్తారా? చేయరా? అనే చర్చకు తెరలేచింది. బీజేపీతో టీడీపీ జత కట్టడంతో జగన్ భయంతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై కూడా విమర్శలు తగ్గిస్తారని కూటమి పార్టీల శ్రేణులు అనుకున్నాయి.
అబ్బే, వాళ్లందరినీ నిరాశ పరిచేలా జగన్ ప్రసంగించారు. బీజేపీ విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా తెలివిగా వ్యవహరించారు. బీజేపీని నోటాతో పోల్చి, అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వెనుక ఎజెండా ఏంటో చెప్పాలని నిలదీశారు. అలాగే 2014లో కూడా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడాన్ని జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని జగన్ విమర్శించారు.
ఇదే చంద్రబాబు విషయానికి వస్తే, గతంలో బీజేపీతో విభేదించినప్పుడు, ప్రధాని మోదీపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఈ తిట్టు తిట్టలేదు అనే రకంగా మోదీ, అమిత్‌షాలపై చంద్రబాబు నోరు పారేసుకున్నారు. బీజేపీ భుజం గన్ పెట్టి జగన్‌ను రాజకీయంగా కాల్చాలని గతంలో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. అవేవీ గత ఎన్నికల్లో పని చేయలేదు.
తాజాగా సిద్ధం సభలో బీజేపీపై జగన్ నేరుగా విమర్శలు చేయడానికి భయపడ్డారని ఎల్లో మీడియా వెటకరిస్తోంది. కనీసం ఏపీలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని బీజేపీపై విమర్శలు చేసేంత బుద్ధి తక్కువ మరొకటి లేదు. అసలు ఎన్నికల్లో తనకు ఏ రకంగానూ ప్రత్యర్థి కాని బీజేపీపై విమర్శలు చేసి, అనవసరంగా కొత్త సమస్యలు తెచ్చుకోడానికి జగన్ ఏమైనా చంద్రబాబులా ఆలోచిస్తారా? పైగా బీజేపీతో టీడీపీ పొత్తు కుదరడం రాజకీయంగా జగన్‌కు ఎంతో ప్రయోజనం. ఏపీకి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని చూస్తున్నారు. అలాంటి పార్టీతో జత కట్టి, చంద్రబాబు తన నెత్తిన భస్మాసుర హస్తాన్ని పెట్టుకున్నట్టైంది. కాగల కార్యం గంధర్వులే చేస్తారన్న చందంగా, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని బద్నాం చేయడానికి ప్రజాసంఘాలు సిద్ధంగా ఉన్నాయి.
రానున్న రోజుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీపై ప్రజావ్యతిరేకత పెంచడానికి జగన్‌తో సంబంధం లేకుండా కొన్ని సంఘాలు, సీపీఎం లాంటి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. బీజేపీపై జగన్ ఎప్పుడూ విమర్శలు చేయరు. బీజేపీని అడ్డు పెట్టుకుని టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం జగన్‌కు లేదు. నేరుగానే చంద్రబాబు, పవన్‌లను చాకిరేవు పెట్టడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు.