అబ్బ‌బ్బా.. స‌మ్మోహ‌ప‌రిచిన జ‌గ‌న్ ప్ర‌సంగం!

ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన వైసీపీ చివ‌రి, నాలుగో విడ‌త సిద్ధం స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఈ స‌భ‌కు జ‌నం వెల్లువెత్తారు. స‌భ‌కు హాజ‌రైన ల‌క్ష‌లాది మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని…

ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన వైసీపీ చివ‌రి, నాలుగో విడ‌త సిద్ధం స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఈ స‌భ‌కు జ‌నం వెల్లువెత్తారు. స‌భ‌కు హాజ‌రైన ల‌క్ష‌లాది మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని ఏ మాత్రం నిరుత్సాహ‌ప‌ర‌చ‌కుండా సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం ఆద్యంతం ఉత్తేజం నింపేలా సాగింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే జ‌గ‌న్ ప్ర‌సంగం స‌భ‌కు హాజ‌రైన వారితో పాటు టీవీల్లో చూస్తున్న వారిని సైతం స‌మ్మోహ‌ప‌రిచింది.

బిందువు బిందువు క‌లిసి సింధువైన‌ట్టుగా, త‌న మీద‌, త‌న పార్టీ మీద న‌మ్మ‌కంతో ప్ర‌భంజ‌నంలా సిద్ధ‌మంటూ ఉప్పెన‌లా త‌ర‌లి వ‌చ్చిన జ‌న‌స‌మూహం మ‌హాస‌ముద్రంలా క‌నిపిస్తోంద‌ని ప్రారంభ ఉప‌న్యాసంలో జ‌గ‌న్ అన్న మాట‌లు…అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించాయి.

సుమారు గంటా ప‌ది నిమిషాల పాటు జ‌గ‌న్ ప్ర‌సంగం ఒక ప్ర‌వాహంలా సాగింది. ఇటీవ‌ల పొత్తు కుదుర్చుకున్న మూడు పార్టీల‌ను ఏకిపారేశారు. నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన జాతీయ పార్టీతో బాబు పొత్తు పెట్టుకున్నాడ‌ని ఎద్దేవా చేశారు. అలాగే ద‌త్త పుత్రుడంటూ ప‌వ‌న్‌పై త‌న మార్క్ పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు సిట్ అంటే సిట్‌, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ద‌త్త పుత్రుడు న‌డుచుకుంటున్నార‌ని వెట‌క‌రించారు. చంద్ర‌బాబు ఇచ్చిన‌న్ని సీట్ల‌తో ద‌త్త పుత్రుడు స‌రిపెట్టుకుని, త‌న వాళ్ల‌ను మోసం చేశార‌ని మండిప‌డ్డారు.

చంద్ర‌బాబు బ‌లం పార్టీలైతే, వైసీపీ బ‌లం ప్ర‌జ‌ల‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళుతున్న త‌న‌కు న‌క్ష‌త్రాలు ఎన్ని ఉన్నాయో, అంత మంది స్టార్ క్యాంపెయిన‌ర్లు ప్ర‌తి ఇంటా ఉన్నార‌ని అన్నారు. మ‌హాసంగ్రామానికి మీరంతా సిద్ధ‌మేనా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించిన‌ప్పుడు…జ‌న స‌ముద్రం నుంచి సిద్ధ‌మంటూ పిడికిళ్లు బిగించి గ‌ట్టిగా స‌మాధానం ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంది. మ‌రో చారిత్రిక విజ‌యాన్ని సొంతం చేసుకోడానికి మీరంతా సిద్ధ‌మేనా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌గా , రెట్టించిన ఉత్సాహంతో సిద్ధ‌మంటూ మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర సిద్ధం, ఉత్త‌ర కోస్తా సిద్ధం, రాయ‌ల‌సీమ సిద్ధం, ఇప్పుడు ద‌క్షిణ కోస్తా సిద్ధ‌మంటూ వైసీపీ శ్రేణుల్ని జ‌గ‌న్ ఉత్తేజ‌ప‌రిచారు. చంద్ర‌బాబు సైకిల్ తుప్పు ప‌ట్టిపోయింద‌ని వ్యంగ్యంగా అన్నారు. సైకిల్‌కు టైర్లు లేవు, ట్యూబ్‌లు లేవ‌ని దెప్పి పొడిచారు. తుప్పు ప‌ట్టిన సైకిల్‌ను ముందుకు తోడానికి ఇత‌ర పార్టీలు కావాల‌ని అవ‌హేళ‌న చేశారు.

ప్ర‌సంగం చివ‌రికి వ‌చ్చే స‌రికి రానున్న మ‌హాసంగ్రామంలో ప్ర‌త్య‌ర్థుల‌తో త‌ల‌ప‌డేందుకు మీరంతా సిద్ధ‌మైతే… సెల్ టార్చిలైట్లు వెలిగించాల‌ని జ‌గ‌న్ కోరారు. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ శ్రేణుల‌న్నీ సెల్ టార్చిలైట్లు వెలిగించి సిద్ధ‌మ‌ని ఉల్లాసంతో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. జ‌గ‌న్ ఇవాళ్టి ప్ర‌సంగం అత్యద్భుతంగా సాగింది. చంద్ర‌బాబు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల్ని, మోస‌కారిత‌నాన్ని అడుగ‌డుగునా ఎండ‌క‌ట్టారు. అలాగే త‌న పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన మంచి గురించి స‌మ‌గ్రంగా వివ‌రించారు.

సిద్ధ‌మా అంటూ జ‌గ‌న్ గ‌ట్టిగా అరుస్తూ, త‌న శ్రేణుల్ని ప్ర‌శ్నించ‌డం, అటు వైపు నుంచి రెట్టించిన రీసౌండ్ రావ‌డం… ఆద్యంతం స‌భావేదిక మార్మోగుతూ సాగింది. స‌భ‌కు హాజ‌రైన వారితో పాటు జ‌గ‌న్ ప్ర‌సంగం వింటున్న వారికి సైతం… ప్ర‌త్య‌ర్థుల‌పై పోరాటానికి సిద్ధం కావాల‌నే స్థాయిలో స్ఫూర్తి ర‌గిల్చింది. భీమిలి కంటే దెందులూరు, దాని కంటే రాప్తాడు స‌భ‌, తాజాగా మూడింటికి మించి సిద్ధం స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. చివ‌రి స‌భ వైసీపీ శ్రేణుల్లో నూత‌నుత్తేజాన్ని నింపింది.