ఎన్నికల వేళ టీమిండియా మాజీ క్రికెటర్లకు, పేరున్న సినీ సెలబ్రిటీలకు గిరాకీ ఏర్పడటం కొత్త ఏమీ కాదు. ఈ క్రమంలో 2024 ఎన్నికల బరిలో కూడా కొన్ని పాత మొహాలు కొత్తగా కనిపించనున్నాయి. రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా క్రికెటర్లను రంగంలోకి దించుతున్నాయి.
గత ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ వంటి టీమిండియా మాజీ ప్లేయర్ బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగి నెగ్గాడు! అయితే తన నియోజకవర్గానికి తను అందించిన సేవల పట్ల సంతృప్తి కలిగిందో ఏమో కానీ గంభీర్ ఈ సారిపోటీ చేయనంటున్నాడు! మరోవైపు పంజాబ్ నుంచి యువరాజ్ సింగ్ ను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. గురుదాస్ పూర్ నుంచి ప్రస్తుతం సన్నీ డియోల్ఎంపీ గా ఉన్నాడు. అయితే ఆయన పనితీరుపై తీవ్ర వ్యతిరేకత ఉందట! ఈ నేఫథ్యంలో యువరాజ్ సింగ్ ను అక్కడ నుంచి బీజేపీ బరిలోకి దింపనుందని వార్తలు వస్తున్నాయి.
బీజేపీ తరఫు నుంచి ఇంకా క్లారిటీ రాకుండానే.. వెస్ట్ బెంగాల్ లో దీదీ ఒక క్రికెటర్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. టీమిండియా కు కొన్ని మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించిన యూసుఫ్ పఠాన్ ను టీఎంపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ప్రకటించారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న బరంపూర్ నియోజకవర్గంలో పఠాన్ ను టీఎంసీ ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు ఊసు లేకుండా బెంగాల్ లోని అన్ని ఎంపీ సీట్లకూ మమత అభ్యర్థులను ప్రకటించింది.
మరి గుజరాత్ కు చెందిన యూసూఫ్ ఫఠాన్ ప్రభావం వెస్ట్ బెంగాల్ లో ఏముంటుందో చూడాల్సి ఉంది! యూపీకి చెందిన క్రికెటర్ మహ్మద్ షమీని బీజేపీ వాళ్లు బెంగాల్ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. షమీ ఇంకా క్రికెటర్ గా బిజీగా ఉన్నాడు! మరి ఇంతలోనే రాజకీయాల్లోకి వస్తాడో లేదో చూడాల్సి ఉంది!
ఇక టీఎంసీ జాబితాలో ఒకప్పటి హీరోయిన్ రచనా బెనర్జీ కూడా ఉండటం గమనార్హం. పలు తెలుగు సినిమాల్లో రచన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఒక బెంగాళీ ప్రముఖుడిని వివాహం చేసుకుని సెటిలైంది. ఆ నేపథ్యంతో చాలా సార్లు మమతతో కలిసి వేదికలపై కనిపించింది రచన, ఇప్పుడు ఈమె కోల్ కతాలోని ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతోంది!