ఈ ఎన్నికల్లో వేవ్ వస్తుందా? రాదా?

ఏ ఎన్నికలయినా మన ఓటర్లు స్పష్టమైన తీర్పునే ఇస్తూ వుంటారు సాధారణంగా. దేశం అంతా జనతా ప్రభంజనం అన్నపుడు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం అటు మొగ్గకుండా మొత్తం తీర్పు ఒకవైపే చెప్పింది. అలాగే…

ఏ ఎన్నికలయినా మన ఓటర్లు స్పష్టమైన తీర్పునే ఇస్తూ వుంటారు సాధారణంగా. దేశం అంతా జనతా ప్రభంజనం అన్నపుడు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం అటు మొగ్గకుండా మొత్తం తీర్పు ఒకవైపే చెప్పింది. అలాగే ప్రతి సారి చేస్తూ వస్తోంది. కానీ ఈసారి అంటే 2024లో కూడా అలాగే చేస్తుందా? లేక భిన్నమైన తీర్పు చెబుతుందా? అన్న అనుమానం వుంది. చాలా మంది రాజకీయ పరిశీలకులు ఎక్కువా ఒకటే చెబుతుంటారు. వార్ వన్ సైడ్ గానే వుంటుంది. అందువల్ల ఈసారి కూడా తెలుగుదేశం గెలిచినా, వైకాపా గెలిచినా మాంచి మెజారిటీతోనే వుంటుంది తప్ప వేరుగా వుండదని చెబుతూ వుంటారు.

మరి ఈ లెక్కన 2024 ఎన్నికల వేళ తెలుగుదేశం మంచి మెజారిటీ సాధిస్తుంది అని కొందరు. కాదు వైకాపా మంచి మెజారిటీ సాధిస్తుందని అని కొందరు అంటున్నారు. గ్రౌండ్ లో ప్రస్తుతం వైకాపా, తేదేపా పోటా పోటీగా వున్నాయని వార్తలు వున్నాయి. పార్టీల సంగతి ఎలా వున్నా, జనాలను ఎవరిని కదిపినా పోటా పోటీగా వుంది వ్యవహారం అనే అంటున్నారు. మరి అలాంటపుడు వన్ సైడ్ మెజారిటీ ఎలా సాధ్యం అవుతుంది?

2014 ఎన్నికల ఫలితాలు తీసుకుంటే 70 వరకు సీట్లను వైకాపా తెచ్చుకుంది. ఆ నాడు భాజపా- తేదేపా- పవన్ కలిసే పోటీ చేసారు. జనం అంతా విభజన నేపథ్యంలో అనుభవం పండిన చంద్రబాబు కావాలనుకున్నారు. అప్పుడే పవన్ రాజకీయాల్లో బలంగా వున్నారు. ఇక మోడీ సంగతి సరేసరి. ఇలాంటి టైమ్ లో కూడా జగన్ 70 సీట్ల వరకు తెచ్చుకున్నారు. తేదేపా స్వీప్ చేయలేకపోయింది.

2019 లో వైకాపా బలంగా స్వీప్ చేయగలిగింది. అయిదేళ్లు అధికారంలో వుండి కూడా తేదేపా కూడా ఈ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. పవన్ దూరం కావడం వల్లనే ఇలా జరిగింది అని అంతా అనుకున్నారు. చంద్రబాబు కూడా ఇలాగే అనుకుని కిందా మీదా పడి మళ్లీ 2014 నాటి పరిస్థితిని పునరుద్దరించాలని అనుకున్నారు. మోడీ, పవన్ ను దగ్గరకు తీసారు. వైకాపా నుంచి చాలా మందిని తేదేపాలోకి తీసుకుంటున్నారు. అందువల్ల మళ్లీ అప్పటి మాదిరిగానే 110 నుంచి 120 సీట్లు తెచ్చుకుంటారు అనుకోవడానికి చాన్స్ వుందా?

2014 కు 2024 కు జగన్ విషయంలో రెండు బలమైన విషయాలు వున్నారు. జగన్ ఏమిటి అన్నది జనాలు అందరికీ బలమైన క్లారిటీ వచ్చింది. అయితే అది అనుకూలంగానే అయినా, వ్యతిరేకంగా అయినా. అనుకూలంగా వున్నవారంతా, ఆయన స్కీములు, నగదు బదిలీ, నమ్మకం..మాట నిలబెట్టుకోవడం. ఇవన్నీ. నెగిటివ్ ఏమిటంటే అభివృధ్ది లేమి అనే విమర్శ. అప్పులు చేస్తున్నారు అనే మాట పడడం. 2014 నాటికి జగన్ అంటే ఈ రెండు విషయాలు తెలియవు. వైఎస్ కొడుకు అన్నది తప్ప.

అంటే దాదాపుగా చెప్పాలంటే 2014 పరిస్థితుల కన్నా 2024 పరిస్థితులు కొంత వరకు జగన్ కు ప్లస్ గానే వున్నట్లు అనుకోవాలి. ఆ లెక్కలో మోడీ-పవన్- బాబు కలిసినా మళ్లీ 70 సీట్లు అనేవి జగన్ కు అనుకూలంగా వుంటే.. అప్పుడు వార్ వన్ సైడ్ ఎలా అవుతుంది. దానికి తోడు స్కీముల లబ్దిదారులు కలిసి వస్తే.. మరో పది పెరుగుతాయి తప్ప తగ్గవు.

చంద్రబాబు ప్లస్ పాయింట్లు చూసుకుంటే

జనసేన శ్రేణులు కలిసి రావడం అన్నది అతి పెద్ద ప్లస్ పాయింట్. రాష్ట్రం మొత్తం రెండు వైపుల వుంది ఇప్పుడు. అంటే ముఖాముఖి పోటీ. అది కూడా కలిసి వచ్చే అంశమే. పట్టణ ఓటరు అనుకూలంగా వున్నారు. పట్టణ యువత అనుకూలంగా వుంది. మెజారిటీ మీడియా అనుకూలంగా వుంది.

కానీ మైనస్ పాయింట్లు చూస్తే, మైనారిటీ ఓట్లు అన్నీ వైకాపాకు చాలా వరకు అనుకూలంగా వున్నాయి. పల్లెలు చాలా వరకు వైకాపా వైపు వున్నాయి. స్కీములు అందుకుంటున్నవారు అంతా మళ్లీ వైకాపా రావాలనే కోరుకుంటారు. అది సహజం. కాపులను తేదేపా దగ్గరకు తీయడం వల్ల కావచ్చు, లేదా జగన్ ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల కావచ్చు బిసిలు అనుకూలంగా వున్నారు.

ఇలా చూసుకుంటే ఎవరి బలాలు వారికి వున్నాయి. అందువల్ల వార్ వన్ సైడ్ అవుతుందా అన్నది అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లోనే మోడీ అండ అవసరం చంద్రబాబుకు. అందుకే వెళ్లి దాన్ని సాధించారు. అటు ఎనభై ఇటు ఎనభై వస్తే పరిస్థితి చాలా దారుణంగా వుంటుంది. అలా కాకుండా ఒక వైపు తీర్పు స్పష్టంగా వస్తే ఫరవాలేదు.

కానీ 2014 పరిస్థితులు చూసుకున్నా, జగన్ పథకాలు లెక్కించుకున్నా, గత అయిదేళ్లలో వచ్చిన నెగిటివీని తీసేసినా కూడా తెలుగుదేశం అనుకుంటున్నట్లు వార్ వన్ సైడ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలా అని హంగ్ రావడానికి చాన్స్ తక్కువ. చూస్తుంటే రెండు పార్టీల్లో ఎవరు అధికారం సాధించిన బొటా బొటీ మెజారిటీతోనే అవుతుందేమో?