24 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడు.. సముద్రం వంగదు, పర్వతం పడుకోదు అని చెప్పిన పెద్ద మనిషి.. చంద్రబాబు ఇచ్చిన వీరముష్టికి ఎందుకు పరిమితం అవుతున్నాడంటే.. అబ్బే, ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు, బంజారాహిల్స్ ఇల్లు అమ్మాడు, జూబ్లీహిల్స్ స్థలం అమ్మాడు.. అంటూ సానుభూతిని సృష్టించే ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు కనీసం ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం లేదనే అంశాన్ని కవర్ చేయడానికి అయితే బ్రహ్మాండమైన అస్త్రాలున్నట్టున్నాయి!
24 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారంటే.. గాయత్రి మంత్రంలో అక్షరాల సంఖ్య అదట! అందుకని 24 అట! మరి ఆ 24లో ఇప్పుడు బీజేపీ వాటా ఎన్ని పోతాయో, చంద్రబాబు ఎన్ని తిరిగి గుంజుకుంటాడో చూడాల్సి ఉంది!
మరి ఇప్పుడు పవన్ కల్యాణుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం లేదు, ఎంపీగా అనే టాక్ నడుస్తూ ఉంది. ఎమ్మెల్యేగా ఉంటే తన స్థాయికి అసెంబ్లీ చిన్నది అయిపోతుందని పవన్ అనుకోవచ్చు! ఇదే రీతిన ఏదో ఒక పోచికోలు వాదన వినిపించి ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నట్టో కూడా చెప్పుకోవచ్చు.
ఇదే సమయంలో జనసేన సోషల్ మీడియాకు మాత్రం మంచి సందు దొరికింది! అదేమంటే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంటే ఆఫ్ట్రాల్ సీఎం పదవికి పోటీ పడటం! అది పవన్ కల్యాణ్ స్థాయికి చాలా చాలా చిన్నది! అదే ఎంపీగా పోటీ చేయడం అంటే.. పీఎం పదవికి పోటీ పడటం, పీఎం అయ్యే అర్హత సాధించేయడం!
అందులోనూ మోడీకి మరో ఏడాదిలో 75 యేళ్లు నిండనున్నాయి, అప్పుడు ప్రధానమంత్రి హోదా నుంచి ఆయన తప్పుకుంటారు. 75 యేళ్లు నిండిన వారు ముఖ్యపదవుల్లో ఉండకూడదని ఆ మధ్య బీజేపీ ఒక నియమం పెట్టుకుంది. ఆ మేరకు వచ్చే ఎన్నికలయ్యాకా.. ఒక ఏడాది కాలానికి మోడీ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగవచ్చు. అప్పుడు ఎవరు ప్రధాని.. అనే చర్చ తప్పదు! పవన్ కల్యాణ్ వంటి త్యాగి, యోగికి మించి అర్హత గల వారు దేశంలోనే లేరు కదా! ఆయనో అభినవ భగత్ సింగ్ కదా.. ఆల్రెడీ ఎంపీ హోదాలో ఉంటాడు కాబట్టి.. ఆయనే ప్రధాని! ఇంకో మాట లేదు!
ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారో.. కవర్ చేసుకోవడానికి ఇంతకు మించిన అస్త్రం పవన్ వీరాభిమానుల వద్ద ఉండకపోవచ్చు! ఆస్తుల అమ్మకం వ్యవహారం తర్వాత ఎంపీగా పోటీ ఆ పై పీఎం అయిపోవడమే అనే అస్త్రంతో కొట్టారంటే.. ఎక్కడి వాళ్లు అక్కడ పడుండాల్సిందే!