ఆకాష్ పూరి.. చాన్నాళ్లుగా సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరో. ఇప్పటివరకు కమర్షియల్ హిట్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో తండ్రి పూరి జగన్నాధ్ కూడా కొడుక్కి హిట్ ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయ్యారు.
మరి పూరి ఆకాష్, పూరి జగన్నాధ్ మరోసారి కలిసే ఛాన్స్ ఉందా..? ఇప్పట్లో అలాంటి ఛాన్స్ లేదంటున్నాడు ఆకాష్. ప్రస్తుతానికైతే తండ్రి దర్శకత్వంలో నటించకూడదని నిర్ణయించుకున్నాడు ఆకాష్. దీనికి అతడి దగ్గర మంచి లాజిక్ కూడా ఉంది.
“ఓ నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత నాన్నను అడుగుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్నతో సినిమా చేయడం కరెక్ట్ కాదు. హీరోగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి. పూరి జగన్నాధ్ తన కొడుకుతో సినిమా చేస్తున్నాడు అనిపించుకోవడం నాకిష్టం లేదు. ఆకాష్ పూరి అనే హీరోతో పూరి జగన్నాధ్ సినిమా చేస్తున్నాడని అంతా చెప్పుకోవాలి.”
తండ్రి దర్శకత్వం వహించిన సినిమాల్లో నేనింతే సినిమా తనకు చాలా ఇష్టమంటున్నాడు ఆకాష్. ఒకవేళ తండ్రి దర్శకత్వంలో సీక్వెల్ చేయాల్సి వస్తే, నేనింతే పార్ట్-2 చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. ఇక బుజ్జిగాడు రీమేక్ పై స్పందిస్తూ, అలాంటి సినిమాలు రీ-రిలీజ్ చేయాలి తప్ప, రీమేక్స్ చేయకూడదని అన్నాడు.