జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీసీసీ సారథ్య బాధ్యతను స్వీకరించిన నాటినుంచి అన్నయ్య మీద అనేకానేక ఆరోపణలతో విరుచుకుపడడం ఒక్కటే తన ధ్యేయంగా చెలరేగిపోతున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ దక్కే అవకాశం లేని ప్రత్యేకహోదాను షర్మిల తన ప్రధాన ఎజెండాగా స్వీకరించారు. హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారంటూ పదేపదే అదే విమర్శలు వినిపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రత్యేకహోదా అనే డిమాండ్ ను కాలరాచిన చంద్రబాబు ఏలుబడిని నిలదీయకుండా.. నిందలన్నీ జగన్ మీదే వేయడం ఆమెకు అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు తమాషా ఏంటంటే.. భారతీయ జనతా పార్టీ ఎదుట మోకరిల్లి చంద్రబాబు వారితో పొత్తు కుదుర్చుకున్న తరువాత కూడా.. ఆమె మాత్రం జగన్ మీద నిందలు వేయడం మానలేదు.
చంద్రబాబును ఏమీ అనడానికి నోరు రావడం లేదేమో గానీ.. ఆయనను పరిమితంగా తిడుతూ.. ఆయన పెట్టుకున్న పొత్తులను ఎవ్వరూ స్వాగతించడం లేదని, అదే సమయంలో అదే బిజెపితో జగన్ రహస్య పొత్తులను కొనసాగిస్తున్నారంటూ షర్మిల ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె మాటలు చూస్తోంటే.. జగన్ మీద విపరీతమైన ద్వేషంతో విషం కక్కడం ఆమె మానలేకపోతున్నారని అనిపిస్తోంది. మొన్నమొన్నటివరకు బిజెపితో జగన్మోహన్ రెడ్డి లాలూచీ పడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ ఆమె ఎన్నిరకాల విమర్శలు చేసినా అర్థం చేసుకోవచ్చు.
పాపం.. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గురైన వంచన ఎఫెక్ట్ తనలో పుట్టిన ఫ్రస్ట్రేషన్‌తో ఏదేదో మాట్లాడుతోందిలే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి సారథిగా ఉన్నది గనుక.. ఏ భారతీయ జనతా పార్టీని అయితే ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిన పార్టీగా ఆమె ముద్ర వేస్తున్నదో.. ఆ భారతీయ జనతా పార్టీతో అంటకాగడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వారితో పొత్తులు పెట్టుకున్నారు.
షర్మిల మాటల్లో నిజాయితీ ఉన్నట్లయితే.. ఇప్పుడు ఆమె చెప్పే నిందలన్నీ చంద్రబాబు మీదికి మళ్లాలి. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రయోజనాల గురించిన చిత్తశుద్ధి ఉంటే.. ప్రత్యేకహోదా గురించి కేంద్రంలోని బిజెపి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప వారితో పొత్తు పెట్టుకోకూడదని లేకపోతే తెలుగు ప్రజలను వంచించినట్లేనని ఆమె తెలియజెప్పాలి. కానీ ఆమె చేస్తున్న కామెడీ ఎలా ఉన్నదంటే.. ఇంకా బిజెపితో జగన్ కు అక్రమ సంబంధాన్ని అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నది.
చంద్రబాబుతో పొత్తు కుదిరిన తర్వాత కూడా.. జగన్ లోపాయికారీ రహస్యపొత్తు కలిగిఉన్నారని అంటే ఎవరు నమ్ముతారు? అంటే.. జగన్ బిజెపితో రహస్య పొత్తు ద్వారా తనకు తానే గొయ్యి తవ్వకుంటున్నాడని ఆమె ఆరోపించినట్లుగా ఉంది. లాజిక్ లేని ఇలాంటి విద్వేష పూరిత ఆరోపణలతో చెలరేగుతూ ఉంటే.. ప్రజల్లో తన క్రెడిబిలిటే (ఉంటే) పోతుందని షర్మిల తెలుసుకోవాలి.