జీవీఎల్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ కుట్ర‌!

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, సీట్ల విష‌యంలో కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అనుమానం జాతీయ‌పార్టీ నేత‌ల్లో వుంది. బీజేపీలో త‌మ‌కు అనుకూల‌మైన నాయ‌కుల‌కు మాత్ర‌మే టికెట్లు ద‌క్కేలా టీడీపీ పావులు క‌దుపుతోంది. విశాఖ ఎంపీ స్థానాన్ని…

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, సీట్ల విష‌యంలో కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అనుమానం జాతీయ‌పార్టీ నేత‌ల్లో వుంది. బీజేపీలో త‌మ‌కు అనుకూల‌మైన నాయ‌కుల‌కు మాత్ర‌మే టికెట్లు ద‌క్కేలా టీడీపీ పావులు క‌దుపుతోంది. విశాఖ ఎంపీ స్థానాన్ని బీజేపీ కోరుతోంది. ఇక్క‌డ చాలా కాలంగా బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటున్నారు. విశాఖ ఎంపీ అనిపించుకోవ‌డం ఆయ‌న జీవితాశ‌యం.

ఈ నేప‌థ్యంలో స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న విశాఖ ప‌ట్నం వెళ్తున్నారు. ముఖ్యంగా విశాఖ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎక్కువ‌గా ఉన్న కాపుల ఆద‌ర‌ణ పొందేందుకు, వారికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలంటూ పార్ల‌మెంట్‌లో కూడా ప్ర‌స్తావించారు. అందుకే ఆయ‌న్ను విశాఖ‌లో నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో స‌న్మానించారు.

విశాఖ‌లో గెలుపొందేందుకు వివిధ వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో జీవీఎల్ ఉన్నారు. పొత్తులో భాగంగా విశాఖ సీటుపై బీజేపీ ప‌ట్టుద‌ల‌తో వుంది. అయితే బీజేపీ పోటీ చేస్తే ఓడిపోతామ‌ని, దీనికి బ‌దులు ప‌క్క‌నే ఉన్న అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ ఇస్తామ‌ని టీడీపీ చెబుతోంది. ఇందుకు బీజేపీ స‌సేమిరా అంటోంది. టీడీపీ నిరాక‌ర‌ణ వెనుక పెద్ద కుట్రే వుంది.

రాజ‌కీయంగా త‌మ‌కు గిట్ట‌ని జీవీఎల్ న‌ర‌సింహారావుకు చెక్ పెట్టేందుకే విశాఖ లోక్‌స‌భ స్థానాన్ని ఇచ్చేది లేద‌ని టీడీపీ తేల్చి చెబుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే సీటును పురందేశ్వ‌రి లేదా సీఎం ర‌మేశ్‌నాయుడికి బీజేపీ ఇస్తామంటే, టీడీపీ రెండో ఆలోచ‌న చేయ‌కుండా అంగీక‌రిస్తుంది. జీవీఎల్ న‌ర‌సింహారావును వైసీపీ అనుకూల బీజేపీ నేత‌గా టీడీపీ భావిస్తుండ‌డం వ‌ల్లే విశాఖ సీటును ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తుంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. టీడీపీ అనుకున్న‌దే జ‌రుగుతుందా?  లేక బీజేపీ ప‌ట్టుప‌ట్టి సాధిస్తుందా? అనేది త్వ‌ర‌లో తేల‌నుంది.