తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు ఒక స్కూల్‌ని దత్తత తీసుకుని బాగు చేశాడు. చిన్న వయసులో సామాజిక బాధ్యతతో వ్యవహరించిన ఆ కుర్రాడిని అభినందించాలి. అయితే హైదరాబాద్ నడిబొడ్డున అంత దరిద్రంగా ఆ స్కూల్ ఎందుకుందో కేసీఆర్‌కే తెలియాలి. సొంత రాష్ట్రం వచ్చి పదేళ్లైంది. ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా మౌళిక వసతులు ఎందుకు లేవు? అన్ని స్కూళ్లకి ముఖ్యమంత్రి మనుమడి అండ దొరకదు కదా!
సరే ఈ సంగతిని పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్‌ని, జగన్ పాలనని ఎద్దేవా చేస్తూ అప్పుడప్పుడు తెలంగాణ మంత్రులు, నాయకులు నోరు పారేసుకుంటుంటారు. స్కూల్ పిల్లలకి జగన్ చేసిన సేవ, కల్పించిన సౌకర్యాలు వాళ్ల కళ్లకి కనపడవు. నాడు-నేడు ఒక అద్భుత పథకం. లక్ష్యాన్ని ఇంకా పూర్తిగా సాధించలేకపోవచ్చు కానీ, ఇప్పటికే పనులు జరిగిన చోట రూపు రేఖలు మారిపోయాయి. కార్పొరేట్ స్కూళ్లని తలదన్నేలా వున్నాయి. కాంపౌండ్ వాల్, వాష్‌రూమ్స్, ఫ్యాన్లు, ఆహ్లాదకరంగా, అందంగా ప్రభుత్వ స్కూళ్లని మార్చిన క్రెడిట్ జగన్‌దే. పడిపోయిన గోడలు, మురికి వాతావరణం మాయమైంది.
గతంలో మధ్యాహ్న భోజనం అంటే పేద పిల్లల అన్నదానంలా వుండేది. జగన్ పాలనలో పిల్లలు ఇష్టంగా తినే భోజనంలా మారింది. నీళ్ల రసం, కూరగాయలు లేని సాంబారు స్థానంలో నాణ్యత వచ్చింది. వారంలో ఒక రోజు ఎగ్ కర్రీతో భోజనం పెడుతున్నారు. చిక్కీలు పిల్లలకి పౌష్టికాహారం. పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు అన్నీ సకాలంలోనే.
అమ్మ ఒడి పేద తల్లులకి ఒక ఆలంబన. ప్రభుత్వ స్కూల్‌కి వెళ్లడం నామోషీ కాదు, ఆత్మగౌరవం. ఆంధ్రాని తక్కువ చేసి మాట్లాడే వాళ్లు తెలంగాణ స్కూళ్లు ఎందుకింత దరిద్రంగా ఉన్నాయో ఆలోచించాలి. మురికి వాతావరణంలో రేపటి పౌరులు ఎలా తయారవుతారో చెప్పాలి. సుందర నగరం, మెట్రో నగరం, అంతర్జాతీయ నగరం అని చెప్పుకునే హైదరాబాద్‌లో స్కూళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి కేసీఆర్ మనుమడే సాక్ష్యం.