మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు భారీ స్కెచ్ గీశారు. తన వర్గం బలంగా తయారు చేసుకునే క్రమంలో వైసీపీలో ఉన్న పాత మిత్రులను పిలిపించుకుంటున్నారు అని అంటున్నారు. అందులో భాగమే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడి షాక్ ఇచ్చారని అంటున్నారు.
పంచకర్ల రమేష్ బాబు గంటా డిస్కవరీ అంటారు. 2009లో విశాఖ జిల్లాలో గంటా ప్రజారాజ్యం తరఫున అభ్యర్ధులను ఎంపిక చేశారు. అలా పంచకర్లకు పెందుర్తి సీటు దక్కింది. ఆయన గెలిచారు. గంటాతో పాటే టీడీపీలోకి వచ్చి ఎలమంచిలి నుంచి 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ ఓటమి తరువాత గంటా సైలెంట్ అయ్యారు. ఆయన వర్గీయులు మెల్లగా వైసీపీలోకి వచ్చారు. అలా 2020లో పంచకర్ల వైసీపీ కండువా కప్పుకున్నారని ప్రచారంలో ఉంది.
గంటా కూడా వైసీపీలో చేరాలని అనుకున్నారని, అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుకోవడం వల్ల అది కుదరలేదు అని అంటారు. ఇపుడు సీన్ మారింది. గంటా టీడీపీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. రీ యాక్టివ్ అయ్యానని ప్రకటించారు. దాంతో ఆయన వర్గం అంతా వెనక్కి తిరిగి వస్తోంది అని అంటున్నారు. పంచకర్లకు వైసీపీలో పెందుర్తి టికెట్ ఇవ్వరు అన్న కారణంతో ఆయన పార్టీని వీడారు అని అంటున్నారు
అయితే ఆయన విశాఖ జిల్ల వైసీపీ ప్రెసిడెంట్ గా ఏడాది కాలంలో పార్టీ పటిష్టం కాలేదు అన్నది అధినాయకత్వం సైడ్ భావన అంటున్నారు. ఈ మార్చిలో జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయింది. అలా పంచకర్ల కొంత అపజయభారం మోశారు.
మరో వైపు గంటా టీడీపీలోనే ఉంటానని అనడం, ఆయన వైసీపీ మీద విమర్శల జోరు పెంచడంతో ఆయన వర్గం మీద వైసీపీ కొంత అనుమానపు చూపులు చూస్తూ వచ్చిందని ఆ నేపధ్యంలోనే పంచకర్ల రాజీనామాతో కధ మరో మలుపు తిరిగింది అని అంటున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాను అని పంచకర్ల అంటున్నారు. ఆయన తొందరలో టీడీపీలోనే చేరుతారు అని అంటున్నారు.