జనసేనాని పవన్‌కల్యాణ్ ఎన్నికల బరిపై భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజక వర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ పార్లమెంట్ పరిధిలో తన గెలుపు సులువు అవుతుందని పవన్‌కల్యాణ్ అంచనా. ఈ మేరకు కొంత కాలంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో పవన్‌కల్యాణ్ వర్కౌట్ చేసుకుంటున్నారని సమాచారం.
జనసేనకు టీడీపీ మూడు పార్లమెంట్ స్థానాలను ఇచ్చింది. వీటిలో మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గాలను కేటాయించారు. ఇందులో కాకినాడ నుంచి పవన్‌కల్యాణ్ బరిలో దిగనున్నారు. ఈ పార్లమెంట్ స్థానం నుంచి కాపులే గెలుపొందుతున్న నేపథ్యంలో, తనకు కాకినాడే సురక్షితమని భావించి, అక్కడి నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమెను పిఠాపురం సమన్వయకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. కాకినాడ వైసీపీ సమన్వయకర్తగా చలమశెట్టి సునీల్‌ను సీఎం జగన్ నియమించారు. కాకినాడ నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తే, వైసీపీ అభ్యర్థి మారుతారా? లేక సునీల్‌నే కొపసాగిస్తారా? అనేది తెలియాల్సి వుంది. కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తే, ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అనుకూలంంగా వుందని చంద్రబాబు భావిస్తున్నారు.
అయితే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక్క కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మినహాయిస్తే, మిగిలిన ఆరు నియోజక వర్గాల్లో కాపులే వైసీపీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఎంపీగా గెలిచి కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇదే సందర్భంలో పవన్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పవన్ బరిలో దిగితే, రెండు చోట్ల చెల్లకుండా పోయే ప్రమాదం పొంచి వుంది.