ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది గామి సినిమా. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు మెరిసింది. నిన్న రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.9.07 కోట్ల గ్రాస్ వచ్చింది.
లిమిటెడ్ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఇది పెద్ద ఓపెనింగ్ కింద లెక్క. అంతేకాదు, విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది గామి సినిమా. అటు ఓవర్సీస్ లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు వచ్చాయి.
అయితే ఇది లాంగ్ రన్ నిలబడుతుందా లేదా అనే విషయంపై ట్రేడ్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే, గామి అనేది ప్రయోగాత్మక చిత్రం. సామాన్య ప్రేక్షకుడికి కాస్త దూరంగా జరిగిన చిత్రం. ఇలాంటి సినిమా క్లిక్ అవ్వాలంటే బి, సి సెంటర్లలో బాగా ఆడాలి. దీనిపైనే చాలామందికి అనుమానాలున్నాయి.
రొటీన్ కు భిన్నంగా ట్రై చేద్దామనుకునే ప్రేక్షకులు ఎలాగూ గామి సినిమా చూస్తారు. వీళ్లతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చినప్పుడు మాత్రమే గామి సక్సెస్ అనిపించుకుంటుంది. పైగా ఇది పరీక్షల సీజన్. సో.. ఈ సినిమా ఏ రేంజ్ లో నిలబడుతుందనేది సోమవారం గడిస్తే తప్ప చెప్పలేం. ప్రస్తుతానికైతే, తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్ లో ఈరోజు, రేపు ఈ సినిమాకు డోకా లేదు.