విడుదలకు ముందు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం కామన్. అలా చెప్పుకోవాలి కూడా. కానీ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత, రిజల్ట్ ఏంటనేది తెలిసిన తర్వాత కూడా గొప్పగా చెబితే కామెడీగా ఉంటుంది. భీమా విషయంలో గోపీచంద్ మాటలు ఇలానే ఉన్నాయి.
భీమా రిజల్ట్ ఏంటనేది చాలా మందికి తెలుసు. సినిమా థియేటర్లలోకి వచ్చి 24 గంటలు దాటింది. రొటీన్ కథకు సెట్ అవ్వని సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ జతచేసి ఏదో చేద్దామని చూశారు, కానీ ఫలితం మరోలా వచ్చింది. కానీ గోపీచంద్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. సినిమాను అంతా ఎంజాయ్ చేస్తున్నారంట, మిగతా ప్రేక్షకుల్ని కూడా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయమంటున్నాడు.
భీమా సినిమాలో గోపీచంద్ కు కామెడీ చాలా బాగా నచ్చిందంట. చాన్నాళ్ల తర్వాత మంచి కామెడీ చేశానని చెబుతున్నాడు. అటు సీనియర్ నటుడు నరేష్ కూడా ఇదే మాట. థియేటర్లలో ప్రేక్షకులు పడిపడీ నవ్వుతున్నారట. సినిమాలో అంత కామెడీ ఎక్కడుందో వాళ్లకే తెలియాలి.
ప్రస్తుతానికైతే థియేటర్లలో శివతాండవం అంటూ పోస్టర్ వేసుకున్నారు మేకర్స్. మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
కాకపోతే గోపీచంద్ గత చిత్రం రామబాణంతో పోల్చి చూస్తే, భీమా చాలా బెటర్. ఈ ఒక్క విషయంలో గోపీచంద్ ఫ్యాన్స్ తృప్తి పడొచ్చు. ఓవరాల్ రిజల్ట్ ఏంటనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది. మాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా మల్టీప్లెక్సుల్లో నిలబడుతుందో లేదో చూడాలి.