టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్‌లపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి వైసీపీ తరపున బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కంటే రాజకీయంగా సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు సిగ్గుందా? అని ప్రశ్నించారు.
బీజేపీతో పొత్తు కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కాళ్లు పట్టుకుంటున్నారని బాబు, పవన్‌లపై ఆయన ధ్వజమెత్తారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు ఢిల్లీలో చంద్రబాబు, పవన్‌కల్యాన్ పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భయపడే వాళ్లు అలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీనే కాదు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలను తోడు తెచ్చుకున్నా తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల కంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బెటర్ అని వెల్లంపల్లి వెటకరించారు. ప్రజాశాంతి పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తోందని ఆయన అన్నారు. వీళ్లలా గుంపుగా రాలేదని ఆయన దెప్పి పొడిచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ 2009లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి పీఆర్పీ తరపున గెలుపొందారు.
ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి, 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలో చేరి, 2019లో విజయవాడ వెస్ట్ నుంచే పోటీ గెలుపొందారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడాయన విజయవాడ సెంట్రల్ నుంచి బరిలో దిగారు. ప్రత్యర్థులపై విరుచుకుపడే వెల్లంపల్లి గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.