బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైందని మీడియాలో వార్తలు రావడం తప్ప, అధికారిక ప్రకటన రాలేదు. ఇక్కడే అందరికీ అనుమానం. బీజేపీతో ఇప్పటికే జనసేన పొత్తులో వుంది. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పవన్‌కల్యాణ్ సీట్లు సర్దుబాటు చేసుకున్నారు. పవన్ పట్టుపట్టి బీజేపీ దగ్గరికి తీసుకెళ్లి, వాళ్లను బతిమలాడి టీడీపీతో పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇంత వరకూ అంత బాగానే వుంది.
అయితే పొత్తుపై బీజేపీ లేదా టీడీపీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో, అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీ-జనసేనకు కలిసి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలను ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి.
గత ఎన్నికల్లో పోటీ చేసినన్ని సీట్లైనా లేకపోతే ఎలా? అని చంద్రబాబు వద్ద కేంద్ర హోంశాఖ అమిత్‌షా ప్రతిపాదన చేసినట్టు బీజేపీ నేతలు అన్నారు. చివరికి చంద్రబాబు అనుకున్నట్టుగానే తక్కువ సీట్లకు బీజేపీని కట్టడి చేసినట్టు వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వస్తే, పొత్తుపై స్పష్టత వచ్చినట్టు అవుతుంది. టీడీపీతో పొత్తు కుదిరితే ఎక్కువ సంతోషించేది…బీజేపీలోని ఆ పార్టీ అనుకూల నాయకులే.
మరీ ముఖ్యంగా పురందేశ్వరి ఆనందానికి హద్దులుండవు. ఎందుకంటే తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ఆమె పట్టుదలతో ఉన్నారు. ఇంతకాలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే బీజేపీలోని కొంత మంది చంద్రబాబు శిష్యులు, ఇప్పుడు అధికారికంగానే అంటకాగనున్నారు.