ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీలో సాగుతున్న పొత్తు ప్రహసనంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ పెద్దల కోసం జనసేనాని పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబునాయుడు పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు తనను తాను తగ్గించుకుని పొత్తు కోసం ఢిల్లీ వెళ్లగా, బీజేపీ పెద్దలు గౌరవించకపోగా, అవమానించేలా వ్యవహరిస్తున్నారనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో వుంది.
బాబుతో పొత్తు వద్దనుకుంటే, ఆ విషయాన్ని ఆయనతో నేరుగా చెప్పొచ్చని టీడీపీ శ్రేణుల భావన. అలా కాకుండా ఢిల్లీకి రప్పించుకుని, రోజుల తరబడి కాపలా కాచేలా బీజేపీ పెద్దలు వ్యవహరించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబుతో బీజేపీ వ్యవహరించే తీరు ఇదేనా? అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలకు సమయం తక్కువ వుందని, ప్రతి నిమిషం విలువైందని, అలాంటిది ఢిల్లీలో చంద్రబాబును వేచి చూసేలా చేయడం వెనుక ఎవరికి ప్రయోజనాలు కలిగించడానికో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిగో, అదిగో అంటూ పొత్తుపై కాలయాపన తప్ప, ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం దేనికి సంకేతం? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల వాలకం చూస్తుంటే, గతాన్ని మనసులో పెట్టుకుని బాబును అవమానిస్తున్నట్టుగా వుందని టీడీపీ అనుమానిస్తోంది.
చంద్రబాబు రాజకీయ చరమాంకంలో ఇలాంటి అవమానం ఎదుర్కోవాల్సి రావడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదిరినా టీడీపీ అభిమానులు ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా సమయం వృథా చేయకుండా పొత్తుపై ఏదో ఒకటి తేల్చాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.