అత్తారింటికి దారేది సినిమా హీరో పవన్‌కల్యాణ్‌కు గెలుపు సీటుకు దారి కావాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పదేళ్లైంది. ఇప్పటి వరకు ఆయన చట్టసభల్లో అడుగు పెట్టలేని పరిస్థితి. గత ఎన్నికల్లో రెండు చోట్ల నిలిచి, రెండింటా ఓడిపోయారు. దీంతో ఈ దఫా ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి ప్రధాన కారణం… తాను గెలిచి చట్టసభలో అడుగు పెట్టేందుకే.
టీడీపీతో పొత్తు పెట్టుకోడానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, ఇతరత్రా డైలాగ్‌లు జనాన్ని మోసగించడానికే తప్ప, మరొకటి కాదనే బలమైన విమర్శ వుంది. టీడీపీ, జనసేన పరస్పర రాజకీయ ప్రయోజనాల రీత్యా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇంత వరకూ బాగానే వుంది. పవన్ గెలుపునకు నమ్మకమైన నియోజకవర్గం కావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకలో ఆయన పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ సారి ఆయన గాజువాకను వదిలేశారు. భీమవరంలో పోటీ చేయడానికి దాదాపు ఆయన సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో తప్పుకుని టీడీపీ ఇన్‌చార్జ్ పులిపర్తి రామాంజనేయులును నిలబడాలని ఆయన కోరడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన పిఠాపురంలో నిలబడుతారనే చర్చకు తెరలేచింది. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ అడ్డం తిరిగారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ పోటీపై ఉత్కంఠ నెలకుంది.
పవన్‌కల్యాణ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రెంటికీ చెడ్డ రేవడి చందమవుతుందని అంటున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. ఇలా రోజుకొక నియోజకవర్గం తెరపైకి వస్తుంది. ఆ వెంటనే సీఎం జగన అక్కడ మోహరింపజేశారని, ఓడిపోతారంటూ మరో నియోజకవర్గానికి వలస వెళుతున్నారు. అందుకే పవన్ నమ్మకంగా గెలిచే నియోజకవర్గం కావాలని జనసేన నేతలు కోరుతున్నారు.